పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అతిసాత్వికు లల్పకు లవ
మతి చేసిన నదె సహించి మన్నింతు రప
స్మృతిమంతుఁ డెంత చేసిన
హితులగు వారలకు రోష మేగతిఁ గల్గున్.

57


క.

భగవల్లోకంబునఁ ద
ద్భగవంతుఁడు భగవదాప్తపరిచారకులున్
భగవద్భక్తులకే వా
సిగవత్సకు మొదవు చన్ను చేపినయట్లన్.

58


సీ.

ఇటువలెనె యుండ నిందిరానాయక
                       భక్తులై వెలసిన బ్రహ్మపుత్రు
లరుదేర వారికి నవమాన మొనరించి
                       నవమానమున నుండ నయమె యాత్మ
నఖిలకృత్యములు బ్రహ్మాధీనమని నమ్మి
                       యాశ్రమాంతరములయందు నున్న
యధిగతపరమార్థులైన వారలకు ను
                       ద్దీప్తమై మూర్తీభవించు శాంతి


తే. గీ.

హరిపదంబున నుండుట యద్భుతంబె
శుద్ధసత్వాబ్ధిఁజంద్రమస్ఫూర్తి నొందు
పరమవిభుని మదమున కోపంబు నుగ్ర
శాపమును గల్గ నేర్చునే శాంతులకును.

59


మ.

అతిసందేహదవాగ్నిఁ దొట్రువడి వేదాంతీభముల్ నేడు సం
తతసంతాపము నొందుచోట నితరుల్ తత్వజ్ఞలే తండ్రి యా
తతవేదాంతరహస్యనిశ్చయసుధోధన్వత్సుధాధామయ
ద్యతవిద్యాహ్వయచంద్రికారుచిని మత్తాపంబు వారింపవే.

60


క.

అని తనయుఁడు తను నడిగిన
ఘనుఁ డామునివరుఁడు సుప్రకాశార్థముగా
విని హర్షగద్గదస్వన
మునఁ బల్కెన్ బాష్పపులకముల్ [1]తిలకించన్.

61
  1. తిలకించున్