పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అరయఁగ బహిరాదరణముఁ
బొరయక యావరణ మగుచు భువనంబులలోఁ
బరఁగిన యధ్వరమూర్తిన్
హరి గొల్చిన మోక్షలక్ష్మి యబ్బకయున్నే.

34


వ.

బ్రహ్మ మొదలు మహాపురుషునిఁ గాను దమోతీతునింగాను ఆదిత్య
వర్ణునిగాను సర్వరూపములును సంగ్రహించి సర్వనామములుం గలిగి
యున్నవానిఁగాను [1]నుదాహరించెను. శుక్రుండు నాల్గుదిక్కుల నట్లన
చాటె నటువంటివాని నెఱుంగుటె మోక్షోపాయ మగును. అన్య
మార్గంబు లేదని [2]వేదపురుషు నే నెఱుంగుదునని పల్కెడు "వేదాహ
మేతం పురుషం మహంతమ్" అనియెడి శ్రుతి వాక్యంబు గలదు.

35


క.

భవపాశబంధకుండును
భవపాశవిమోచకుఁడును బ్రహ్మము కైవ
ల్యవిభవదాయకుఁడు వి
ష్ణువె యగు వేదాంతదివ్యసూక్తుల నెంచన్.

36


తే. గీ.

అర్కునివలన నారోగ్య మాయె నలుని
వలన సిరియును శంకరువలన బోధ
[3]మచ్యుతు వలన ముక్తియు నందవలయు
ననఁగ నుపనిషదుక్తి యుక్తార్థముగను.

37


వ.

అనిన వివి ఋషులు పరమహర్షసమేతులై సూతునకు మఱియు
నిట్లనిరి. ప్రహ్లాదుండు పూర్వజన్మంబున నారాయణనిష్ఠాపరుండై
యుండి మఱియును.

38

బ్రహ్మవిద్యారహస్యము

క.

ప్రాజ్ఞుఁడు ప్రహ్లాదుం డన
నజ్ఞులకును బ్రహ్మవిద్య యది పుట్టెను న
త్యజ్ఞుఁ డగు దైత్యునకు శా
స్త్రజ్ఞుం డాధీరుఁ డెట్లు జనియించెఁ దగన్.

39


క.

ఇలలోన బ్రహ్మవిద్యా
కలితులకుఁ బునర్భవములు గలుగవు. వరుఁడై
వెలయు హరి నెఱిఁగి మృత్యు
ప్రళయముఁ దాఁటునని శ్రుతి తిరంబుగఁ బలికెన్.

40
  1. ఉదహరించెను
  2. వేదపురుషుం డే నెఱుంగుదు
  3. మచ్యుతనివలన - గణభంగము