పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నాభియును, 'శ్రీవత్సధారిణే నమ' యని వక్షస్స్థలంబును, 'సహస్ర
శిరసే నమ' యని బాహువులుసు, 'సర్వేశాయ నమ' యని కంఠప్రదేశ
మును, 'సర్వాత్మనే నమ' యని ముఖంబును, 'సుప్రభాయ నమ' యని
లలాటంబును, 'శతమఘాయ నమ' యని కేశంబులును బూజించి,
జాగరంబు గావించి విష్ణుమహత్త్వప్రతిపాదకపురాణంబులు వినుచుఁ
బ్రాతఃకాలంబునఁ గుటుంబి యగు వైష్ణవునకుఁ గ్రోడసహితననైవేద్య
పరిచ్ఛదకుంభంబు దానం బిచ్చి యంత బంధువర్గంబుతోఁ గూడఁ
బారణ చేసినఁ బునర్జననంబు నొందఁడు. జ్ఞానాజ్ఞానకృతంబగు
బహుజన్మార్జితపాపంబును సూర్యుం డంధకారంబును బోలె హరించు
నిటువంటి ద్వాదశి పూర్వజన్మంబున నాచరించినదానవు. తన్మహత్త్వం
బున నీపతి యీపుత్రుం డీసంపద నీకు లభించె. తద్ద్వాదశీవ్రతపుణ్య
చతుర్థాంశంబు నా కిచ్చితివేని భర్తృనిమిత్తద్రవ్యలోభపాతకంబుఁ
దరించి సద్గతిం బొందెద. నాయట్టు లెవ్వతె లోకంబున నాచరించు
నది క్రిమియోనిశతంబునం బుట్టి పిమ్మటఁ జండాలియై జన్మించునని
విన్నవించిన దానికిఁ దత్ఫలం బొసంగితి. ఏఁ జూడ విష్ణుపురంబున
కేఁగె. స్త్రీలకుఁ బతియే దైవంబు. పతిని విడిచి పితృగృహంబున
కేఁగి బ్రాహ్మణభార్య కాష్టకీటం బగుట చూడవే? కులశీలాద్యభిమాన
వతివి. మఱియొకటి వేడుమని పలికిన రోషంబున సంధ్యావళిం
జూచి యిట్లనియె.

163

మోహిని ధర్మాంగదుని రాజు చంపవలెనని కోరుట

సీ.

సకలధర్మాధర్మసార మీ వెఱిఁగిన
                       దానవు పతిహితత్వంబుకొఱకుఁ
బ్రాణ మిచ్చెదవేనిఁ బ్రాణం బనఁగ నెంత?
                       యంతకంటెఁ దలంప నధికుఁడైన
ధర్మాంగదునిఁ బట్టి తనచేతివాలునఁ
                       దలఁ ద్రెవ్వనేసి యాతల నిజాంక
భాగంబుపైఁ బక్వఫల మున్నయట్లుగాఁ
                       బరఁగఁబూనిన వానిశిరము నవ్య


తే. గీ.

చంద్రబింబసమంబు నశ్మశ్రుకంబు
కుండలాంకంబునైన యాగొనబు చూచి
సంతసిల్లుచు నేత్రాశ్రుజలము లేక
రాజు వర్తింపవలయు నో రాజవదన!

164