పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బ్రసిద్ధం బయ్యె. ఇది మహాపాపంబు లపహరించు. కునృపతి దేశం
బునుం బోలెఁ, గుపుత్రుండు కులంబునుంబోలెఁ గుభార్య పతింబోలె,
నధర్మము ధర్మువుంబోలెఁ, గుమంత్రి రాజుంబోలెఁ, గుజ్ఞానంబు
జ్ఞానంబునుంబోలెఁ, గుశౌచంబు శౌచంబునుంబోలె, నసంవాదంబు
సంవాదంబునుంబోలె, ననత్యంబు సత్యంబునుంబోలె, హిమం బుష్ణం
బునుంబోలె, ననర్థం బర్థంబునుంబోలెఁ, బ్రకీర్తనంబు దానంబుంబోలె,
విస్మయంబునఁ దపనంబునుంబోలె, నశిక్షచేఁ బుత్రుండునుంబోలె,
దూరగతి గోగణంబునుంబోలె, సంకేతంబు పైతృకంబునుంబోలె,
వివర్థనంబున విత్తంబునుంబోలె, భీమద్వాదశి సమస్తాఘంబు
ల హరించు.

160


సీ.

బ్రహ్మహత్యా సురాపాన హేమస్తేయ
                       గుర్వంగనాసంగ ఘోరతరమ
హాపాతకములు సయ్యన నన్నియును గూడి
                       ప్రాపింప హరివాసరంబె కాని
యరయఁ బుష్కర నైమిశారణ్య కురుదేశ
                       శమనసహోదరి జహ్నుపుత్రి
కా నర్మదాదేవికా ప్రభాసాది తీ
                       ర్థజపతపోహోమదానమహిమ


తే. గీ.

లణఁప నేరవు లోకంబు లభినుతింప
భూమిలోపలఁ గల పుణ్యములును హరిది
నవ్రతపుసుకృతము దూఁచ నయము దెలియ
సరియె హరివాసరవ్రతసారమునకు?

161


తే. గీ

ద్వాదశీపుణ్యవాసరోత్సవము వంటి
యుత్సవము గల్గ నేర్చునే యుర్వియందు
నజహరాదులకైన శక్యంబె దాని
మహిమ యంతయుఁ గొనియాడ మధురవాణి!

162


వ.

ద్వాదశినాఁడు హాటకవరాహపురుషరూపంబు గావించి ఘటోపరి
భాగంబున నవతామ్రపాత్రంబు నిలిపి దానియందు సర్వబీజంబులు
నించి [1]సితవస్త్రంబు గట్టి సువర్ణం బిడి చుట్టు దీపంబులు పెట్టి, సురభి
కుసుమంబులు నిగిడ్చి 'వరాహాయ నమ' యని పాదంబులును,
‘క్రోడాయ నమ’ యని కటిస్థలంబును, 'గంభీరఘోషాయ నమ' యని

  1. "శీత" వ్రాతప్రతి