పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాఘమాసమహిమ

వ.

మఱియు మాఘమాసంబున దేవతలు తమతేజంబు జలంబుల నుంతురు.
తజ్జలస్నానంబున బ్రహ్మహత్యాదిపాపంబులు మొఱలిడుచుం
దొలంగు. నాఁడు స్నానంబు చేసినవారికిం గల సద్గతి సంగరస్థలంబున
నైన లేదు. సరిన్నిర్ఝరజలంబులం దవగాహించుట యుత్తమంబు.
వాపీతటాకంబులయందు స్నానంబు గావించుట మధ్యమంబు. గృహ
స్నానంబు శ్రేయో౽ర్థు లగువారికిఁ జేయందగదు. శీతలజలంబునఁ
బ్రాతస్స్నానంబుఁ జేయఁ బ్రశస్తంబు. క్లేశంబునంగాని సౌఖ్యంబునఁ
బుణ్యంబు లభించదు. శ్రేయస్కాముండగువాఁడు వహ్నిఁ గ్రాఁగం
జనదు. హోమార్ధంబు వహ్నిస్పర్శంబు సేయందగదు. సూర్యోద
యంబునఁ దూర్పు దెల్లనగుట మేఘావరణంబున సూర్యుఁడు గానరాక
యుండిన నుదయంబె కా నెఱంగవలయు. ఉదయంబున స్నానం
బర్హంబు గాదు. సరిత్తోయంబు దౌరకకయున్న నవకుంభస్థితజలంబులు
వాయువు రాత్రి సోఁకినయవి తీర్థమాడిన గంగాస్నానసమం బగు.
మాఘంబున దినదినస్నానంబు చేసి శర్కరతోఁ గూడఁ దిలలు దానం
బొసంగవలయు. మాఘావసానంబున బ్రాహ్మణులకు షడ్రసోపేతం
బుగా భోజన మొసంగవలయును. విష్ణుమూర్తియై నిరంజనుడగు
సూర్యుండు ప్రీతుం డగుంగాక యని దంపతులకు శుక్లవస్త్రంబులును
సప్తధేనువులును మోదకంబులును దిలమయంబు లగునవి ముప్పది
యర్పింపవలయు నామోదకంబు లొకభాగంబు శర్కరయు మూఁడు
భాగంబులు, తిలలు నారికేళశకలంబులు మూఁడుభాగంబులును,
నేలామరీచంబులతోఁ గూడఁ జేసిన దాన శుద్ధి యగు. మాఘంబు
నెలయు నభ్యంజనంబు వర్జింపవలయు బ్రాహ్మణుండు.
          "దివాకర! జగన్నాథ! ప్రభాకర! నమో౽స్తుతే
            పరిపూర్ణం కురుష్వేదం మాఘస్నానం మమాచ్యుత!"
యని సూర్యప్రార్థనంబు చేసి యాసూర్యబింబంబు భేదించి పరమ
ధామంబు నొందుం గావున మాఘస్నానంబు సేయునతండు మోక్ష
గామి యగు. తన్మాసంబున శుక్లపక్షైకాదశియందు నాదిత్యార్కంబులఁ
గూడెనేని మహాపాతకనాశం బగు. నక్షత్రంబుఁ గూడకుండిన నుప
వసింపవలయు, కౌరవులలో యశస్కరుండుగు భీముం డుదరాగ్నిచే
నుపవాసంబున కోర్వకుండియుఁ దన్మాసంబున నుపవసించిన మహా
ఫలం బని యెఱింగి యుపవసించు. నాఁటనుండి భీమైకాదశి యనం