పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయవలసిందని నారదుడూ, నారదునిముఖం వానరముఖంగా చేయవలసిందని పర్వతుడూ కోరతారు. విష్ణువు వారిద్దరి కోరికను మన్నించి అనుగ్రహిస్తాడు. శ్రీమతి స్వయంవరానికి అనేకమంది వెళ్ళారు. నారదపర్వతులే కాక శ్రీమహావిష్ణువు కూడా వెళ్ళాడు. నారదపర్వతుల వానరముఖాలను చూచి అందరూ నవ్వారు. శ్రీమతి పవిత్రదివ్యసుందరరూపుడైన మహావిష్ణువును వరిస్తుంది. ఆమెను విష్ణువు స్వీకరించి వెళ్ళిపోయాడు. నారదపర్వతులిద్దరికీ కోపం వచ్చింది. అప్పుడు వారిద్దరూ "మా యిద్దరిలో ఒకరి కిస్తానని మాట యిచ్చిన నీవు శ్రీమతిని మా యిద్దరిలో ఏ ఒక్కరికీ ఇవ్వకుండా ఇతరునికి ఇచ్చావు కాబట్టి నీవు తమోమయుడవు అవుదువు గాక" అని అంబరీషుణ్ని శపించారు. ఆ వెంటనే శ్రీమహావిష్ణువుచక్రం వచ్చి నారదపర్వతులను వెంటాడం మొదలు పెట్టింది. వారిద్దరూ సరాసరి వైకుంఠానికి పరుగెత్తి శ్రీ మహావిష్ణువు వద్ద ఉన్న శ్రీమతిని చూచారు. "మాముఖాలు వానరముఖాలుగా చేసి అంతకు పూర్వమే మేము ప్రేమించిన పిల్లను నీవు తెచ్చుకున్నావు. కాబట్టి నీవు నరుడవై జన్మించి భార్యావియోగదుఃఖాన్ని అనుభవించి చిట్టచివరికి వానరులసహాయంతో నీ భార్యను నీవు పొందుతావు." అని శ్రీ మహావిష్ణువును శపిస్తారు. అప్పుడు విష్ణువు ఇదంతా మహేశ్వరుని ప్రభావంతో జరిగిందని నారదునికి వివరించి చెప్పి అదృశ్య మవుతాడు. ఈ శాపకారణంగానే విష్ణువు రామావతారం పొందడం, భార్యావియోగదుఃఖాన్ని అనుభవించడం, ఆంజనేయాది వానరులసహాయంతో రాముడు తన భార్యయైన సీతను పొందడం సంభవించింది.

ఈ విధంగా శ్రీమహావిష్ణువును శపించడం లక్ష్మీమాతను శపించడం రూపంగా సీతారామ అవతారాలకు మూలకారకుడైన నారదుణ్ని, మహాసృష్టికి మూలభూతుడైన విష్ణుపుత్రుడై విష్ణుసాన్నిధ్యంలో తనకంటె ముందుగా ప్రథమస్థానంలో ఉన్న బ్రహ్మకు పూజార్చనాదులు లేకుండా చెయ్యడంలో కూడా పాత్ర వహించిన నారదుణ్ని, మొత్తం దేవరాక్షసవ్యవస్థల్లో దుష్టులను శిక్షించడంలోనూ, శిష్టులను రక్షించడంలోనూ బహుముఖాలుగా పాత్ర వహించిన నారదుణ్ని అపరజగన్నాటకసూత్రధారి అంటే తప్పేముంది. అందుకే మొట్టమొదటే శ్రీ మహావిష్ణువే జగన్నాటకసూత్రధారి అనుకుంటాం గాని నారదమహర్షి కూడా జగన్నాటకసూత్రధారియే అని పేర్కొనడం జరిగింది.

సంస్కృత నారదీయపురాణం

అపూర్వమహర్షిగా దేవర్షిగా అపరజగన్నాటకసూత్రధారిగా పేర్కొనదగిన ఈనారదమహర్షిచేత ప్రోక్తమైన సంస్కృత నారదీయపురాణంలో అసలు