పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గానాభ్యాసం చేసి మహాపండితుడై తుంబురునిపట్ల ఈర్ష్యారహితుడై సుఖంగా ఉన్నాడు.

శ్రీమహావిష్ణువు మానవుడుగా శ్రీరాముడుగా జన్మిచడానికి నారదుడే మూలకారకుడని లింగ, శివపురాణాలు రెండూ పేర్కొంటున్నాయి. వాటివల్ల తెలుస్తున్న విషయాలు యివి.

నారదుడు హిమాలయపర్వతంమీద తపస్సు చేసుకుంటూ ఉండగా తపోభంగం కలిగించడానికై ఇంద్రుడు దేవకన్యలను పంపిస్తాడు. నారదుడు తన దివ్యతపశ్శక్తితో శివారాధన చేస్తూ ఉంటాడు. దేవకన్యలు నారదుని మనస్సుని చలింపచేయాలని యెంతప్రయత్నం చేసినా శివప్రభావంవల్ల నారదుని హృదయం నిశ్చలంగా నిలిచి ఉన్నది. అందువల్ల నారదునికి "నా హృదయాన్ని దేవకన్యలు సైతం చలింపచేయలేకపోయారు కదా" అని బాగా గర్వం వచ్చింది. తనమహిమవల్లనే మన్మథుడిని జయించగలిగానని కూడా నారదుడు అనుకుంటూ ఉండేవాడు. నారదుడు తపస్సు ముగించి శివదర్శనం చేసి తరువాత బ్రహ్మనూ, శ్రీ మహావిష్ణువునూ చూడడానికి వెళ్ళాడు. విష్ణువు శివమాహాత్మ్యాన్ని గుర్తించినప్పటికి కూడా నారదుడు తన శక్తిసామర్థ్యాలవల్లనే కామాన్ని జయించానని యితరులసమక్షంలోనే కాదు విష్ణుసమక్షంలో సైతం చెప్పుకునేవాడు. నారదుడు విష్ణుదర్శనం చేసి తిరిగి వెళ్ళేటప్పుడు అతను ప్రయాణం చేసే మార్గంలో ఒక సుందరతరమైన నగరాన్ని నిర్మించి ఆనగరంలో మహాసౌందర్యవంతురాలైన శ్రీమతి అనే సుందరాంగిని విష్ణువు సృష్టించాడు. నారదుడు ఆ శ్రీమతిని చూచి మోహించాడు. అనంతరం నారదుడు శ్రీమతి స్వయంవరానికి వెళ్ళేముందు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి విషయం చెప్పి విష్ణురూపాన్ని తనకు అనుగ్రహించవలసిందిగా కోరతాడు అని ఒక అసమగ్రకథ.

నారదుడూ, పర్వతుడూ లోకసంచారం చేస్తూ అంబరీషనగరానికి వచ్చి అతని సమ్మానాదులందుకుని అతని యింట్లో వున్న అతిలోక సుందరియైన అతనిపుత్రిక శ్రీమతిని చూస్తారు. ఈ కన్య యెవరని వారిద్దరూ అడుగుతారు. అప్పుడు అంబరీషుడు ఆమె తన కుమార్తె అని చెప్పుతాడు. ఆమెను తమ కీయవలసిందని నారద పర్వతులిద్దరూ కోరతారు. అప్పుడు అంబరీషుడు "ఒకే కన్యను ఇద్దరి కివ్వడం సాధ్యంకాదు కదా! మీ ఇద్దరిలో ఆమె ఎవ్వరిని వరిస్తే వారి కిస్తా"నని చెప్పుతాడు. అనంతరం శ్రీమతి కొకరోజున స్వయంవరం యేర్పాటు చెయ్యడం జరిగింది. అంతకు పూర్వమే నారదపర్వతులిద్దరూ ఒకరి కొకరు తెలియకుండా శ్రీమహావిష్ణువుదగ్గరకు వెళ్ళి శ్రీమతి స్వయంవరసందర్భంగా పర్వతునిముఖం వానరముఖంగా