పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/488

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

చనుచో నంత నిశీథమయ్యెఁ బురరక్షాశీలకుల్ ధావనం
బున నన్యోన్యభయంకరార్భటి సమాపూర్ణోగ్రకోలాహలం
బునఁ బెల్లార్చుచు రాజవీథికల చప్పు ళ్ళాలకింపఁగఁ గ
న్గొని యారాజకుమారి పల్కె నపు డాక్షోణీశభృత్యాళితోన్.

146


వ.

మీరు వేగంబునం జని మజ్జనకుండగు రాజుతో నంతఃపురంబున నుండి
మున్ను న న్నొకదురాత్ముండు రాక్షసుండు గొని చనిన నారాక్షసుని
చేత సమాషితనై బ్రదికి వచ్చితి. నాకై విచారంబు నందవలవదు.
బ్రాహ్మణుం డొకండు మహానుభావుండు తోడ్తెచ్చె నతని నెదుర్కొని
యర్ఘ్యపాద్యపురస్సరంబుగాఁ బూజింపుము. దైవవశంబున శత్రుం
డణఁగంద్రొక్కలేఁడయ్యె. పితృవనంబున గతజీవుల యన్నంబు
భుజించు వాయసంబునకు హవిర్భోజనంబు లభించునే? శునకంబున
కుచ్ఛిష్టంబుగాక రాజార్హంబైన పంచగవ్యప్రాశనంబు సిద్ధించునే? ఏను
దద్రాక్షసునకు భార్యనై బ్రదుకనేర్తునే తల్లిదండ్రులైన మీభాగ్యవిశే
షంబున విష్ణుపాదసంప్రాప్తగంగోదకధారవలెఁ బవిత్రనై వచ్చితి నని
విన్నవించుఁడని పలికిన సుబాహుండను పురరక్షాపాలుండు రాజ
గృహంబున కరిగి యన్నియు విన్నవించిన నద్భుతంబగు తద్వృత్తాంత
మంతయు విని రాజు మహామాత్యకళత్రపురోహితసమేతుండై పుర
ద్వారంబున వెడలి గంగాతీరంబున సమానకుసుమాభిరామయు నను
పమమణిభూషణోద్దామయు నగు కూఁతుం గాంచి దూరంబుననుండి
మొఱలిడుచు వచ్చి యక్కునం జేర్చె నంత నంతరంగంబు నిండ నా
కాంత తండ్రికిం బ్రణమిల్లి ఏను ధౌతచరణనై కాళ్ళకడ శిరంబు చేర్చు
కొని నిద్రింప రాక్షసుండు గొని చనియె. నన్ను వరింపదలఁచిన రాక్ష
సుని నేతన్మానుషాకృతినున్న తద్భార్య సాపత్న్యదుఃఖంబున వానిపై
నలిగి యతండు శౌర్యంబునం దెచ్చిన యింద్రశక్తి దైవవశంబునం
జేరిన యీబ్రాహ్మణునిచేతి కిచ్చి మడియించె. మమ్ముఁ గరేణురూపం
బునఁ దనపై నెక్కించుకొని యిచ్చటికిం దెచ్చె. దీనిం బూజింపవలయు.
ఈబ్రాహ్మణోత్తముండు సద్గుణపూర్ణుండు. ఈతండె నాకుం బతి.
పురాణంబుల నొకనికిం గూర్చినయది యొకనికి లభించదని పలుకుదు
రితనిపై నాకు మనంబు దగిలినయది. సతీధర్మంబు నిట్లనె యగు.
శాస్త్రాగమనిదర్శనంబున నితనిం గని యే నన్యు నొల్ల. ఈరాక్షసి