పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

ఇటుల నెఱిఁగి నీకు హితవృత్తి పాటించి
యీయకార్యకరణ మేల యనుచు
మాన్పఁదలఁచి నీకు మఱియును మఱియును
దెలుపవలసె నాకు జలజనయన!

105


ఆ. వె.

ధర్మబుద్ది చెప్పఁదగు విరోధికి నైనఁ
జెలిమి గలుగునెడలఁ జెప్పఁదగదె?
యదియుఁగాక పతికి నత్యంతహితవృత్తి
గలిగి యునికి మానఁగలనె చెలిమి.

106


వ.

అని సంధ్యావళి పలికిన విని నగి నీవచనంబులు ధర్మనిబద్దంబు లగుట
సేయందగు. వివాదంబుచేత ద్వంద్వదృష్టి యగునని నారదాదులచేతఁ
బలుకంబడియె. హరివాసరంబున నీ రాజు భుజింపండేని మరణాధికం
బైనయొకటి సేయవలయునది నాకును దుఃఖకరంబగు నైనను నేను
దైవవశంబునఁ బలుకుచున్నదాన. నాత్మహనన విషభక్షణ గిరిశృంగ
పతన వ్యాళవదనచుంబన వ్యాఘ్రసింహాభిగమనంబు లెవ్వరికి
నిష్టంబులు? దురుక్తానృతవాక్యపరదారాభిమర్శనాభక్ష్య భక్షణా
భోజ్యభోజనమృగయాపానద్యూతక్రీడన తృణకాష్ఠచ్ఛేదన లోక
దండన సూక్ష్మజీవహింస నక్రీడనంబు లెవ్వరికి నర్హంబులు? ఇట్టివి
యేను నతండు [1]సేయమే? యశోదాహకంబై ఘోరంబైన నరక
కర్మంబు సేయండే?[2] ఏను నిర్దయనై పలుకుచున్నదాన. తండ్రి యెటు
వంటిభావంబుఁ దలంచుఁ దద్భావంబుననే యపత్యంబు జనియించు.
రుక్మాంగదభ్రంశనార్థంబు జలజసంభవుండు నన్ను దుర్భావన
సృజించెం గావున నాకు దుష్టత్వంబు గాక శిష్టత్వంబు గలదే? నీకును
రాజునకు ధర్మాంగదునకుం గీర్తి యగునట్లుగా నొకటి యెఱిగించెద
ననిన సంధ్యావళి యిట్లనియె.

107


ఆ. వె.

ఆత్మహాని పుత్రహాని సామ్రాజ్యైక
హాని యైన నెంత నధిపవాక్య
సత్యకరణశీలశాలిని న్నైన నా
కకట! వెతలు గలవె యాత్మలోన?

108
  1. "సేయండే?" వ్రాతప్రతి
  2. ఈరెండువాక్యముల కన్వయము కుదురుట లేదు.