పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

భూమిన్ రుక్మాంగదుఁడను
నామము నేకాదశీదినవ్రతపుణ్య
శ్రీమహిమయుఁ గీర్తింపఁగ
సామాన్యుం డనఁగ బ్రదుక శక్యం బగునే.

99


వ.

అనృతంబు పలికిన నాకీర్తి యెటులైనం గానిమ్ము మోహినినిమిత్తంబు
మరలదు: హరివాసరంబు వదలననిన తండ్రి వాక్యంబులు విని
సంధ్యావళి రావించి మోహినికి మనోభంగంబు గాకుండ, రాజు
హరివాసరవ్రతభంగంబు గాకుండ నన్యోన్యానురాగంబు నొందింపు
మని విన్నవించిన సంధ్యావళి మోహినిం జూచి ప్రియవచనంబుల
నిట్లనియె.

100

సంధ్యావళి మోహిని ననునయించుట

తే. గీ

అధిపు ధర్మంబుఁ దొలఁగింప నాగ్రహంబు
సేయకుము నీమనంబులోఁ దోయజాస్య!
యమ్మహారాజు హరివాసరాంతరముల
నన్న మనుపేరు వీనులనైన వినఁడు.

101


తే. గీ.

భర్త సువ్రత మొనరింప భార్య యాత్మ
నానుకూల్యంబు వాటించి యాచరించి
యందుఁ బోఁ బుణ్యలోకంబు లమితకీర్తి
వెలయు సావిత్రివోలెఁ బవిత్ర యగుచు.

102


వ.

మందరాచలంబున శుభకరంబగు కరం బిచ్చి కామాంధుండై మఱచి
యున్ననేమి? అది నేఁ గావించెద. ఈరాజు శైశవంబున నుండి హరి
దినంబున భుజియింపఁడు. మఱియొక్కటి వేఁడుము. నన్ను, ధర్మాం
గదు, రాజ్యంబును, జీవితంబునేని యిప్పింతు. వరిష్ఠనైన నేను గనిష్ఠ
నైన నేమి? అధికనిష్ఠం బాదంబు లొత్తెద, మ్రొక్కెదం బ్రస
న్నవు కమ్ము.

103


చ.

పతి ననురక్తిమై శపథపాశముల న్మెడఁగట్టి యీడ్చి యు
న్నతిమతియై యకార్యకరణంబులకుం బురికొల్పునట్టి యా
సతి నరకంబులం బడి యసారగతిన్ బదిరెండుజన్మముల్
క్షితిపయి వల్గు లీతనువుఁ జెందు నిజంబు నిజంబు మానినీ!

104