పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుక్మాంగదుఁడు తననిశ్చయము నెఱింగించుట

తే. గీ.

అనృతమై యుండనీ వాక్య, మపయశంబు
వొందనీ; ఘోరనిరయంబుఁ జెందనీ; ము
కుందవాసరభుక్తి నేఁ గోర నొల్ల
నందనందనసత్కృపానందమహిమ.

94


తే. గీ.

అధికదుర్మేధ యిది మూర్ఖ యగ్గలముగఁ
బరుషభాషలు పల్కినఁ బల్క నిమ్ము
కోర దెయ్యదియును మహాఘోరధర్మ
దూరనారకవీథుల త్రోవఁ గాని.

95


క.

క్రిమినై యనృతవచఃపా
పమునన్ జనియింతు మీఁదఁ బంకజనాభో
త్తమదినమునఁ గల్మషభో
జ్యము సేయఁగ నొల్ల సకలజనులు హసింపన్.

96


సీ.

ఎడసి పోనిమ్ము మోహినియు నేతద్విర
                       హానలంబున మామకాంగ మెటుల
నుండిన నుండనీ చండాంశునందనో
                       ద్దండదండాహతి ధరణిజనులు
నరకబాధల నొంద నమ్మించి నే నె ట్లు
                       పేక్షింతు నిఖిలసురేంద్రమౌళి
తటతలంబులు ద్రొక్క ధన్యత హరివాస
                       రోపోషితజనంబు [1]నొంచి విష్ణు


తే. గీ.

లోకమంతయు నిందించి లోలబుద్ధి
నన్యధర్మంబు నే నెట్టు లాచరింతు
భార్యకై కాముకుండనఁ బ్రథ వహించి
యితర మొల్లదు దుర్మేధ యీలతాంగి.

97


క.

గరళము మ్రింగుదు వైశ్వా
నరుశిఖలం బడుదుఁ బడుదు [2]ననిశిఖరముపై
శిర మసిఁ డూలింతును శ్రీ
హరివాసరమున భుజింప నాత్మజ! యింకన్.

98
  1. యతిభంగము. నుంచి?
  2. ఈపాదమునం దఖండయతి కలదు.