పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


శా.

కోశాగారము రాజధాని సకలక్షోణీతలద్వీప మా
ద్యాశాచక్రసదేశదేశగజవాహానీకముం బ్రాఁతియే?
యీశాతోదరి కిచ్చి నిల్పు మిఁక ధాత్రీశా! భవత్సత్యభా
షాశీలంబు ధనుర్ధరుండనయి నే సాధింతు నేవస్తువుల్.

88


సీ.

శక్రపదం బిమ్ము జగదీశ! యాశక్రుఁ
                       డోడినాఁడని చూడు ముగ్రశక్తి
శక్రపదాకాంక్ష సల్పదేని కృశాను
                       యమయాతుధానజలాధినాథ
పవమానయక్షేశపదములు నర్పింపు
                       మది నొల్లదేని బ్రహ్మపదమైన
సనకాదిఘనయోగిజనరంజమున నిరం
                       జనమునై యున్న సశక్యతపముఁ


తే. గీ.

జేసి పద్మజు మెప్పించి సిరులతోడ
మెఱయఁ జేకొని తెత్తు నమేయమహిమ
నదియు నర్పింతు నీవు జిహ్వాగ్రవీథి
నాడి సత్యంబు వదలుట యర్హ మగునె?

89


క.

అనఘాత్మ! సత్యవర్తన
జనని మనోరథము దీర్ప స్వరమహీభో
గినిలయములఁ గలవస్తువు
లనిశంబు జయించి తెత్తు నర్పింతు ధృతిన్.

90


తే. గీ.

పార్థివేశ్వర! నీప్రతాపంబువలన
నవనిలోపల నా కసాధ్యంబు గలదె?
దాసుఁడఁ దనూజుఁడ హితుండఁ దల్లి [1]నన్ను
నెయ్యది యొనర్పు మనిన నే నిపు డొనర్తు.

91


క.

మజ్జననీ మజ్జీవిత
మజ్జాయాజనమునైన మహి రంజిలి వి
ద్వజ్జనము మెచ్చ నిచ్చెద
నిజ్జనము లనంగ నాకు నెంత నరేంద్రా!

92


వ.

కావున నింద్రవైభవంబును, దినేంద్రతేజంబును గలవాఁడవు. నీకు
నీయపయశంబు వహియింపం దగునే? యని పుత్రుండు పలికిన
రుక్మాంగదుం డిట్లనియె.

93
  1. "నాకు" వ్రాతప్రతి