పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ననుచు నాత్మోపకారకంబైన కోర్కె
యొకటి తా నిచ్చువరమున కొనరఁ గోరి
బ్రాహ్మణోత్తములును నేనుఁ బ్రార్థనంబు
సేయ ననృతంబు పలికె దుశ్శీలుఁ డగుచు.

80


తే. గీ.

హా! సురాపానతుల్యకృత్యంబు గాదె
యనృత మాడుట ధర్మబాహ్యప్రవర్త
నుండు భాషింపనైన నర్హుండు గాఁడు
దోష మిఁకనైన నీతనితోడఁ గూడ.

81


వ.

అనిన ధర్మాంగదుఁ డిట్లనియె.

82


చ.

అనృతము పల్కనేరఁడు కృతార్థుఁడు మజ్జనకుండు తొల్లి, నేఁ
దనయుఁడ [1]నేడు గల్గి ననృతంబులు పల్కు నె? నీపు తాల్మి భూ
వనితవు రమ్ము రమ్మిపు డవద్యము లెంచక తల్లి! నీకు నీ
మనసునఁ గల్గు కోర్కు అనుమానము లే దొనరింతు నెంతయున్.

83


మ.

ధరణీచక్రము సర్వలోకనుతశశ్వత్కీర్తి యైనట్టి మ
ద్గురుసత్యంబున నిల్చియున్నయది, దుర్దోర్దండదండప్రచం
డరయోద్దండపిచండదండధరపీడల్ మాన్పె, సప్తాంతరీ
పరమారాజ్యవిభాసి ధర్మగుణసంపన్నుం డయో! బొంకునే?

84


వ.

అన మోహిని మరలఁ జనుదెంచె నంత.

85


మ.

మణివైడూర్యసమన్వితం బగుచు సమ్యర్దివ్యరత్నావళీ
ఘృణిదీపాంకురతేజ[2]మౌ పురము లాకీర్ణాంతరంబై సుల
క్షణదీర్ఘత్వవిశాలతాకలితమై కాన్పించు శయ్యన్ సమీ
క్షణముల్ మూయుచు విప్పుచున్ గలఁగి రాజన్యుండు చింతింపఁగన్.

86


క.

చని కనుఁగొని యీమోహిని
యనరానివి నిన్ను నాడ నర్హం బగునే
తనయుఁడ నేఁ గల్గఁగ నీ
వనృతోక్తులు పల్కితివని యాడించుకొనన్.

87
  1. "నేను" అని వ్రాతప్రతి.
  2. "మై పురము లాకీర్ణాంత" అని వ్రాతప్రతి