పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

యతికి విధవకు నేకాదశినాఁటి యన్నంబు నింద్యం బనుట యతికిఁ
బరదారాభిగమనంబు గర్హితం బనిన వర్ణాశ్రమాదుల కగర్హిత మనుటే?
ఇది యుచితంబుగాదు.

63


క.

దోషాకరసంక్షయమున
యోషామణిఁ గూడి భోగ మొందిన శ్రీమ
చ్ఛేషశయనదినసకృదను
పోషితమున సకలనరకములు ప్రాపించున్.

64


క.

[1]అకటఁ జతుష్పదజంతువు
నకునైనను నరుఁడు భోజనము పెట్టఁగ రా
దకలంకబుద్ధియగు నరు
నకు యుక్తం బగునె? హరిదినమున భుజింపన్.

65


వ.

ఉత్తరాశాస్థితులై విష్ణుభక్తిపరాయణులైన విప్రులచేతఁ జేయంబడని
దురాచారం బెట్లొనర్చెద? మీవచనంబు సేయ నొల్ల. మిమ్ము నిందు
లకుఁ బిల్వఁ బంపితినే? క్షీణదేహుండఁ గాను. ధర్మాంగదుండు రాజ్య
భారంబు వహింప న న్నెవ్వం డెదిరింప శక్తుం డిట్లెఱింగి మీ రీరీతిం
బల్కందగునే? ఒల్లనివానికిం బ్రాయశ్చిత్తం బెవ్వ రొనర్తురు తత్పా
పంబు వారలకే యగును.

66


మ.

సురదైతేయఫణీంద్రసాధ్యమునిరక్షోయక్షగంధర్వకి
న్నరవిద్యాధరఖేచరార్కరజనీనాథాదులున్ విష్ణుశం
కరపద్మోద్భవశుక్రులుం గదిసి సాక్షాత్కారమై నిల్చి ధీ
వరతన్ శాస్త్రముఁ దెల్పిరేనియు భుజింపన్నేర్తునే? యిత్తఱిన్.

67


క.

ధర దిరిగిన నాహిమవ
ద్గిరి దిరిగిన జలధు లింకి కెడసిన వైశ్వా
నరుఁ డుష్ణత విడిచిన నీ
హరివాసరసువ్రతము ప్రియంబే విడువన్.

68


చ.

త్రిభువనసీమయందు వినుతింపఁ బ్రసిద్ధికి నెక్కి ధారుణీ
విభునభమించి మత్పటహవిస్ఫుటఘోషము రత్నఖేటక
ప్రభుపురరాష్ట్రముఖ్యముల బ్రాహ్మణముఖ్యులు విష్ణువాసరా
భిభవము చేసినం గుశలఁ బెట్టు నృపాలకుఁ డంచు మ్రోసెడిన్.

69
  1. "ఆకట" వ్రాతప్రతి