పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

బహువాదమూలమై భాషించు వేదంబు
                       యజ్ఞకర్మక్రియాద్యంబు వేద
[1]మఖిలగృహస్థాశ్రమస్ఫూర్తి వేదంబు
                       స్మృతిమర్మవిద్యయౌ [2]హృద్యవేద
మమితపురాణరహస్యతంత్రము వేద
                       మాదిత్యపురుషజన్మములు జగము
లట్లైన వాఙ్మయం బంతయు నీపురా
                       ణంబులయందె ధన్యత వహించె


తే. గీ.

నట్లు గానఁ బురాణార్ధ మధికతరము
తెలియ వేదార్ధమునకంటె వెలయుననుచు
సుప్రతిష్ఠము చేసిరి సూటిగాఁ బు
రాణములయందు వేదతంత్రంబు లెల్ల.

53


వ.

"పరమార్థం బెఱుంగలేక యల్పశ్రుతులైనవారు మదర్థం బితిహాస
పురాణస్మృతినిర్ణీతం బైనదానిం జెఱుతు" [3]రని వేదంబులు పలుకు.
వేదంబునందు గ్రహసంచారంబును లగ్నశుద్ధియుఁ దిథివృద్ధిక్షయం
బులుఁ గాన్పింపవు; యాజ్యాయాజ్యులు నేర్పడరు; బ్రహ్మహత్యాదు
లకుఁ బ్రాయశ్చితాదులు నిర్ణయింపబడవు. అంగంబుల నెయ్యది
దీపించు నుపాంగంబుల నెయ్యది గాన్పించు స్మృతిపురాణంబుల
నెయ్యది ప్రకాశించు నదియ వేదంబులు నుచ్చరించుం గావున:
    “నభోక్తవ్యం నభోక్తవ్యం సంప్రాప్తే హరివాసరే
     పురాణమన్యథాకృత్వా తిర్యగ్యోని మధా౽ప్నుయాత్”
అని మొఱ్ఱ వెట్టుచున్నవి. పితృమాతృనింద సేయుకంటెను,
గంగాస్నానంబు సేయకయుండునంతకంటెను, హరివాసరంబున
భుజియించునంతకంటెను, దేవబ్రాహ్మణులదూషణంబు సేయునంత
కంటెను, బ్రహ్మహత్య గావించునంతకంటెను, పరదారాభిగమనంబు
గావించునంతకంటెను మహాపాపంబుఁ గావింప నెవ్వరితరంబు? అని
యెఱింగి హరివాసరంబున భుజియింపనేర్తునే? అనిన.

54
  1. ఈపాదమునం దఖండయతి కలదు.
  2. "విద్య" అని వాతప్రతి. అప్పుడు యతిభంగము.
  3. "నని” వ్రాతప్రతి.