పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అవనిలో నెంచి చూడ నయాచితోప
వాసనక్తైకభుక్తప్రవర్తనమున
దానమునఁ దద్వ్రత మొనర్చి ద్వాదశీవ్ర
తంబు సాధింపవలయు నుత్తమజనంబు.

44


మ.

అరయన్ గర్భిణులున్ గృహస్థులును క్షీణాకారుఁడున్ బాలుఁ డా
తురులున్ వృద్ధులు భారవాహులు మహీంద్రుల్ యుద్ధసన్నద్ధులున్
బరమోత్కృష్టపతివ్రతామణులు నాపన్నుల్ సమగ్రోపవా
సరతు ల్గాఁదగదంచు గౌతముఁడు వైశాఖాద్రిఁ బల్కెన్ ధృతిన్.

45


వ.

ఎవ్వరికి నగ్నిపరిగ్రహంబు గలదు వారు గృహస్థులు. ప్రజాపాలన
ప్రవణు లెవ్వరు వారు రాజులు. ఎనిమిదవ[1]మాసం బేర్పడిన యా
యింతి గర్భిణి యగు. అష్టవర్షాన్వితుం డెవ్వండు? వాఁడు బాలుండు.
యజ్ఞభాగోద్యతులై తిరుగ [2]నతిలంఘనంబు సేయువారు క్షీణులు.
మనోవాక్కాయకర్మంబులఁ బతిహితంబు సేయువారు పతివ్రత లింక
నివి యేల? ఏకాదశి నీతోఁగూడ భుజింపం బ్రీతి యయ్యెడు. లోక
త్రయంబు నీ విచ్చిన నాకుఁ దృణంబు. శిరం బిచ్చిన నెంత? దక్షిణ
కరం బిచ్చి పాలించకుండితివేని యీదేహంబు విడిచెద. వర్ణాశ్రమ
ములకు సత్యంబు వలయు. విశేషించి రాజులకు సత్యంబె శ్రేయో
మూలంబు.

46


సీ.

సత్యంబుచేతనే జలజాప్తుఁ డుదయించు
                       సత్యంబుచేతనే శశి వెలుంగు
సత్యంబుచేతనే జగతీతలము నిల్చు
                       సత్యంబుచేతనె జరుగు గాడ్పు
సత్యంబుచేతనే జ్వలనుండు దీపించు
                       సత్యంబుచేతనే జగము లుండు
సత్యంబుచేతనే జలధి వేల మెలంగు
                       సత్యంబుచేతనే నడలు వింధ్య


తే. గీ.

మఖిలఋతువులుఁ బుష్పఫలాభివృద్ధి
సత్యముననె స్ఫురించు నీసకలదిశలు
సత్యమున మించియున్నవి సత్యవాక్య
మశ్వమేధసహస్రపుణ్య మను నజుండు.

47
  1. "గర్భం" బని వ్రాతప్రతి
  2. "యతి" యని వ్రాతప్రతి