పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

వ్రతభంగం బొనరింపఁగాఁ దలఁప కో వామాక్షి నాపైఁ బ్రస
న్నత పాటింపుము రాజ్యసంపద లనూనస్ఫూర్తిఁ గైకొమ్ము త
న్మతి లేకున్నఁ దదన్యకార్య మెటులైనం జేసెదన్ నిన్ను మ
త్సతులెల్లన్ శిబిక ల్వహింపఁ గొలుతున్ దత్పాదచారంబునన్.

40


మ.

అది గాదేని సువస్త్రవిద్రుమమయోద్యత్కాంచనస్తంభరా
జదుదాత్తామలకోరుమౌక్తికఫలాంచల్లోలడోలాస్థలిన్
మదిరాక్షీ! నిను నూఁచెదన్ సొగసుగా మాణిక్యసౌధంబులో
మదిరాక్షీణము [1]సేయ కింకఁ గరుణన్ మన్నించి న న్నేలవే!

41


తే. గీ.

మానవుండు (జగతిని) స్వమాంస పుత్ర
మాంసములు దిన్నఁ దరియించు మత్తుఁ డగుచు
హరిదినంబున భుజియించునట్టి పాప
మఖిలజన్మంబులఁ దరింపఁ డనఘచరిత!

42


వ.

కాంతా! త్రైలోక్యహననపాపంబును, గుహూదినంబున రతి
యొనర్చు పాపంబును, భూమి యంగుళిమాత్రం బపహరించి మిథ్యా
విక్రయం బొనర్చిన పాపంబును, నిక్షేపాహరణం బొనర్చిన పాపం
బును, భూతతిథియందు క్షౌరంబు చేయించుకొనిన పాపంబును, హరి
వాసరంబున భుజియించిన పాపంబును, షష్ఠిం దైలంబు పూసిన
పాపంబును, దృతీయను లవణంబు చవిగొనిన పాపంబును, అష్టమిని
మాంసం బనుభవించిన పాపంబును, విశ్వాసఘాతపాపంబును, మృత
వత్సాప్రదోహనపాపంబును, బున్నమను జూదం బాడిన పాపంబును,
రవిసంక్రమణంబున సురాపానంబు చేసిన పాపంబును, గోప్రచార
ప్రలోపంబు గావించిన పాపంబును, గూట[2]సాక్షి పలికిన పాపంబును,
నగరక్షేత్రగ్రామద్రవ్యాదులు బ్రాహ్మణున కిచ్చెదనని బొంకిన
పాపంబును, నిర్ణీతంబులైనమీఁద ననృతాక్షరంబులు పల్కిన పాపం
బును, గన్యానృతపాపంబును, ననృతపాపంబును, మాంసకూట
మహాకూటపాపంబులును, కనకాధానంబునందు [3]శుద్ధం బని యాడిన
పాపంబును సమంబులు గాన హరివాసరంబున నెట్లు భుజింతు ననిన
మోహిని యిట్లనియె.

43
  1. "వ" అని వ్రాతప్రతి
  2. సాక్ష్య మనుట లెస్స. "సాక్షి చెప్పు" వ్యవహారమున నున్నది.
  3. "సిద్ధం బని" వ్రాతప్రతి