పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ఇట్లు నడువక నాసీమ నెవ్వఁ డుండు
వాడు వోదండ్యవధ్యనిర్వాన్యతాప్ర
ధానవృత్తుల కర్హు డుద్దండశక్తి
నజమహేశ్వరశక్రాదు లడ్డమైన”.

33


వ.

అని చాటిన విని సకర్పూరతాంబూలంబు చేతిది విడిచి, మోహినీ
కుచకేశీమహోదయంబైన హృదయంబుఁ దిగిచికొని, శయనంబు డిగ్గి;
మధురవచో౽మృతధారల మోహిని నోలార్చి “కార్తిక వ్రతంబు నీ
యాజ్ఞచే విడిచితి; ప్రబోధని విడువ శక్యంబు గాదు. నాతో నుపవ
సింపు" మనిన మోహిని యిట్లనియె.

34


మ.

ఇనవంశేంద్ర! నిమేషమాత్రమయినన్ [1]నే నోర్వ ని న్బాసి, చే
సినమేరం గమలేశవాసరపరిస్ఫీతవ్రతాచారవ
ర్జన ముద్వృత్తి నొనర్చి భోజనము పూర్ణప్రీతిఁ గావింపు కం
తునితాంతాతతభీకరప్రదరశక్తుల్ తాళ శక్యంబులే?

35


వ.

కావునఁ బూర్వంబు నా కొకవరం బొసంగితివి. తద్వరంబున కిది
యవసరంబు. నీ వనృతంబు పలికెదవేని చతుర్దశేంద్రపర్యంతంబు
నరకంబు లనుభవించెద వనిన రా జిట్లనియె.

36


చ.

కమలజపుత్రివై సకలకర్మములెల్ల నెఱింగి ధర్మవి
ఘ్నమునకు నోడవైతి గుఱి గల్గిన సద్గుణరాశి నేను స
త్యముగ శిశుత్వవేళయుఁగదా భుజియింప; జరాప్తకేశశౌ
క్ల్యమున భుజింపనేర్తునె? ప్రగల్భుఁడనై హరివాసరంబునన్.

37


ఆ. వె.

మానవుండు ముదిమిఁ బూని క్షీణేంద్రియ
బలత నుండి పాపభంజనమున
కభ్రతటిని మునుఁగ నర్హుండు గాకున్న
హరిదినోపవాసి యైన మేలు.

38


ఉ.

బాల్యమునందు నీవ్రతము భక్తి నొనర్చితిఁ గొంత కొంత సౌ
శీల్యము గల్గి యౌవనముఁ జెందియుఁ జేసితి దండహస్తహృ
చ్ఛీల్యము గాఁగ వార్ధకవిశేషమునన్ విడనేర్తునే మనో
లౌల్యమునన్ వచించితి భళా! కలకంఠి! భయంకరార్భటిన్.

39
  1. ఇక్కడ యతి విచార్యము. దృతద్విత్వముగా పెంచినచో సరిపడును.