పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాడు. అప్పుడు విష్ణువు నారదుణ్ణి గరుత్మంతునిమీద యెక్కించుకుని కన్యాకుబ్జం తీసికొని వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న చెరువులో నారదుణ్ణి స్నానం చేయవలసిందిగా చెపుతాడు. అప్పుడు నారదుడు కొలనులో స్నానం చేసి రాగా అతిలోకసుందరియైన ఒకయువతిరూపం తాల్చుతాడు. అనంతరం శ్రీ మహావిష్ణువు తనదారిని తాను వెళ్ళిపోతాడు. తరువాత ఈసుందరిని తాళధ్వజుడనే రాజు చూచి మోహించి తననగరానికి తీసికొని వెళ్తాడు. అనంతరం ఆసుందరిని వివాహం చేసికొని పట్టపురాణిని చేస్తాడు. ఈదంపతులకు అనేకమంది పుత్రులు కలుగుతారు. కొన్నిసంవత్సరాలు గడచిన తరువాత శత్రురాజులు తాళధ్వజునిమీద దండెత్తి పుత్రులతోసహా తాళధ్వజుని సంహరిస్తారు. తాళధ్వజుని భార్య దుఃఖసముద్రంలో మునిగి వుండగా శ్రీమహావిష్ణువు వృద్ధబ్రాహ్మణరూపంలో వచ్చి సంసారమూ పతీ పుత్రాదులూ శాశ్వతం కాదని తెలియజెప్పి తనవెంట రమ్మని తీసికొనివెళ్ళి ఒకచెరువులో స్నానం చెయ్యమంటాడు. వెంటనే ఆ పడతికి పూర్వరూపం వచ్చి నారదుడుగా రూపొందడం జరుగుతుంది. అప్పుడు నారదుడు అసలువిషయం గ్రహించి తన ఎట్టయెదుట వున్న మహావిష్ణువును చూచి ఇదంతా అతని మాయామాహాత్మ్యమని గ్రహిస్తాడు.

ఈవిశేషాలన్నీ వివిధాలుగా ఇలా ఉండగా అసలు నారదుడు బ్రహ్మచారి కానేకాదని అతడు వివాహం చేసుకుని సంసారం చేశాడనికూడా కొన్నిగాథ లున్నాయి.

"నారదుడు అతని మేనల్లుడైన పర్వతుడు త్రిలోకసంచారం చేస్తున్నారు. వారిద్దరూ ఒకరి హృదయంలో ఉన్నది ఒకరు దాచకుండా పరస్పరం విషయాలు చెప్పుకొనడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుని ప్రమాణాలు చేసుకున్నారు. ఈ ఒప్పందానికి భిన్నంగా వారుభయుల్లోనూ ఏ విషయాన్నైనా దాచడం జరిగితే శాపగ్రస్తు లవడానికికూడ ఆమోదించారు. తరువాత ఒకరోజున వారిద్దరూ సృంజయుడనే రాజువద్దకు వెళ్ళారు. ఆ రాజు తన పుత్రిక అయిన సుకుమారిని పరిచర్య చేయడానికై ఈమహర్షులవద్ద నియమించాడు. సుకుమారిని చూచి నారదుడు ప్రేమించాడు. అయితే ఈవిషయాన్ని సిగ్గువల్ల నారదుడు పర్వతునికి చెప్పలేదు. నారదుని హృదయంలోని వాంఛను పర్వతుడు గ్రహించి "మన ఒడంబడిక ప్రకారం నీహృదయంలోని విషయాన్ని నాకు చెప్పకుండా దాచిపెట్టావు కాబట్టి నీవు సుకుమారిని వివాహం చేసుకున్నతరువాత నీముఖం వానరముఖం అవుతుంది" అని నారదుణ్ణి పర్వతుడు శపించాడు. అప్పుడు నారదునికి కోపంవచ్చి "నీవు నాకలోకసంచారవిరహితుడవు అవుదువు గాక" అని ప్రతి