పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

సకలలోకోపరిప్రదేశమున నున్న
దాన నీసద్గుణస్ఫూర్తిఁ దనయ మాన్య
ధన్య రాజావరోధిమూర్ధన్య నైతి
నూతనముగ ఫలించె నానోములెల్ల.

276


క.

సప్తద్వీపవిభుఁడవై
సప్తాశ్వనిభుండవై యశస్స్ఫూర్తి సుధీ
రాప్తతయై వర్ధిల్లఁగ
దృప్తారి జనంబు కలఁగి తిరిగిరి తనయా!

277


క.

తనయుఁడు పుట్టిన జననీ
జనకుల కాహ్లాదకరణసౌభాగ్యకళా
ఘనశక్తి చూపకుండిన
ననఘా! పాపాత్ముఁ డెంచ నాతఁడు గాఁడే?

278


వ.

అని సూపకారజనంబు నీక్షించిన యంత షడ్రసాన్నామృతాన్న
భాండంబులు ముందర నిడునంత.

279


మ.

అమృతాహారము కందమూలములు సూపాపూపహయ్యంగవీ
నములుఁ జిత్రఫలోత్కరంబు పరమాన్నంబు [1]రసాంచద్విశే
షము మాంగళ్యముఁ దేనె తిమ్మనము పచ్చళ్లాదిగాఁ గల్గు భో
జ్యము వడ్డించె నకించిదంచితవిలాసశ్రీలు దైవారఁగన్.

280


తే. గీ.

[2]పానభాజనవేష్టితచర్మపాత్ర
తలమున విరించినందన తా భుజింప
సాతకుంభాసనమున నాసాధ్వి తాళ
వృంత మొకవింత నంతంత వీవఁ దొణఁగె.

281


వ.

దూరంబున ధర్మాంగదుండు పింఛపుటాలపట్టంబున విసరి భోజనా
నంతరంబునం దాంబూలంబు మడిచి యిచ్చుచునుండ సంధ్యావళి
చందనం బలంది నవ్వుచు, నీవె ధర్మాంగదునకు జననివి కాకున్న నీ
విట్లు సేవింప నెన్నఁడుం గైకొనినదానం గాననినం జూచి ధర్మాంగదుం
డిట్లనియె.

282
  1. రసావళ్విశేషము మచ్ఛండియు దేవె
  2. పానభాజనచేషిత