పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

కరులం దేజుల నీవు దృష్టిగని సాక్షాచ్ఛక్తిఁ బాలించితే
వరుసం దల్లుల కెల్ల హృత్ప్రియముగా [1]వర్తించితే కీర్తిగా
నరు లేకాదశి యుండఁజేసితె నిశానాథక్షయప్రాప్తులన్
గరిమం బైతృక [2]మాచరింతురె జనుల్ కర్మైక విశ్వాసులై.

232


సీ.

మొదల నిద్ర యనర్థమూలంబు, నిద్ర పా
                       పవివర్ధనము, నిద్ర పరమనిత్య
దారిద్ర్యజనని, నిద్ర సమస్తశోకమో
                       హనిదానఖని, నిద్ర యాధిరాజ్య
పాలనవిఘ్నసంపత్తి నిద్ర కుమార!
                       యపరరాత్రంబులయందు నిద్ర
మాని వర్తింతువే మానిని పుంశ్చలి
                       యైన లోకద్వయ మాత్మభర్త


తే. గీ.

కంటనీని తెఱంగున నడఁచు, నిద్ర
రాజులకుఁ గాన నీరీతిఁ బ్రబలశ క్తి
నడఁచితే యంచుఁ దండ్రి నెయ్యం బొసంగఁ
బలుక ధర్మాంగదక్షోణిపాలుఁ డనియె.

233


వ.

స్వామీ! నీకటాక్షంబున నిట్లనె యాచరించిన పుత్రులు జగత్రయ
వంద్యులు. కాకున్నఁ దత్పాతకంబున కంతంబు గలదె? శరీరజీవన
ధర్మంబులు త్వదధీనంబులు. సుతులకుం దండ్రియ దైవంబు. త్రిలో
కియు నీకు సమర్పించిన ఋణంబు తీరునే యని పలుకు తనయునిం
జూచి రుక్మాంగదుం డిట్లనియె.

234


చ.

పలికితి వేదసమ్మతసుభాషలు పుత్రక! తండ్రికంటె భూ
స్థలమునఁ బుత్రసంతతికి దైవత మెవ్వఁడు? తండ్రిమాటలో
మెలఁగని యాకుమారకుని మీఁదట నల్గుదు రెల్లవేల్పులున్
నిలిపితి మత్కులంబు ధరణీభరణాభరణైకదక్షతన్.

235


క.

భూపతులు మెచ్చ సప్త
ద్వీపంబులు నేలితివి సుధీజను లలరన్
సౌపర్వాలోకసుఖ
ప్రాపకుఁడవు నీవె నాకుఁ బావనమూర్తీ.

236
  1. వర్తించితేఁ గీర్తిగా
  2. మాచరించిరె జనుల్ కర్మైకవిశ్వాసులై