పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేరే వరంతో పనేముంది" అని అంటాడు. అప్పుడు నారదుడు సంతోషించి "నీకు దేవతలను మించగల పుత్రుడు సంజనితుడవుతాడు" అని వరమిస్తాడు. నారదుడు వర మిచ్చిన వెంటనే "అయితే ఆ పుట్టే పుత్రుడికి ఆయుష్కాలం తక్కువ" అని పర్వతు డంటాడు. పర్వతుని వాక్యం విని రా జెంతో దుఃఖితు డవుతాడు. సృంజయునిమీద ఉన్న కరుణతో నారదుడు అనుగ్రహించి "ఇంద్రుడు నీకుమారుణ్ని చంపుతాడు. అప్పుడు నన్ను నీవు స్మరించుకో. నీపుత్రుణ్ని నీకు పునర్జీవితునిగా చేసి నీ కిస్తాను." అని చెప్పుతాడు. అనంతరం సృంజయునికి పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుని నిష్టీవనాదులు అన్నీ సువర్ణమయాలుగా ఉండడంవల్ల "సువర్ణష్టీవి" అని ఆ బాలునికి పేరు పెట్టారు. అతని నిష్టీవనాదులన్నీ ఎప్పటికప్పుడు బంగారంగానే ఉంటూ వచ్చాయి. అయితే సువర్ణష్టీవి శరీరం అంతా బంగారమేనని భావించి కొందరు చోరులు అతనిని చంపి కోశారు. అప్పుడు సృంజయుడు నారదుని స్మరించుకొనగా నారదుడు ప్రత్యక్షమై దొంగలు చేసిన దుష్కృత్యాన్ని తెలియజేసి ఆబాలుని బ్రతికించి సృంజయుని కిచ్చాడు. అనంతరం కొంతకాలానికి సువర్ణష్టీవిని చూచి మహేంద్రుడు అసూయపడి బృహస్పతితో ఆలోచించి సువర్ణష్టీవి వనవిహారం చేస్తున్న సమయంలో తన వజ్రాయుధాన్ని శార్దూలరూపంలో పంపి అతన్ని చంపిస్తాడు. అప్పుడు సృంజయుడు నారద మహర్షిని స్మరించగా అతడు ప్రత్యక్షమై సువర్ణష్టీవిని తిరిగి బ్రతికించి సృంజయుని కిచ్చాడు.

వరాహపురాణాన్ని పరిశీలిస్తే ఈక్రిందివిశేషాలు మరికొన్ని తెలుస్తున్నాయి. నారదు డొకసారి రావణాసురునివద్దకు వెళ్ళాడు. రావణుడు నారదుడిని ఎంతో గౌరవించి ఏమిటి విశేషాలని అడిగాడు. అప్పుడు నారదుడు 'రావణా! నీవు నరుల్నందరినీ జయించావు. దానివల్ల నీకు లభించిన లాభ మేమిటి? దేవతలంతా ఎంతో గర్వించి వున్నారు. వారిలో యమధర్మరాజు మరీ మహాగర్వంతో ఉన్నాడు. వారినందరినీ ఓడించు' అని రావణాసురుణ్ణి పురికొల్పి దేవతలమీదికి రావణుడు యుద్దానికి వెళ్ళడానికి ముందుగానే గబగబా నారదుడు యమధర్మరాజు వద్దకు వెళ్ళి "చూచావా! రావణాసురుడి గర్వం! వాడు నీమీదికి యుద్ధానికి రాబోతున్నాడు. వాడి పొగరు అణచి పారవెయ్యి" అని యమధర్మరాజుతో చెప్పాడు. అప్పుడు యమధర్మరాజుతో జరిగిన యుద్దంలో రావణునికి గర్వభంగం జరిగింది.

మహిషాసురుడు కారణంగా దేవతలు యమయాతన పడుతున్నారు. అతనితో ఎంత యుద్ధం చేసినా దేవత లతన్ని ఓడించలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో నారదుడు మలయపర్వతంమీద ఉన్న దేవీస్వరూపిణియైన నారాయణి వద్దకు వెళ్ళి "విన్నావా, మహిషాసురుని కళ్ళకావరం, వాడు నిన్ను వివాహం చేసుకుంటాడట.