పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలయవనుడనే మ్లేచ్ఛరాజు మహాబలవంతుడై గర్వపోతుగా నా అంతటివాడు లేడని రొమ్ము విరచి తిరుగుతున్నాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని పీచ మడచినతరువాత నారదమహర్షి కాలయవనుని వద్దకు వెళ్ళి "శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి ఓడించాడని మహాగర్వంతో విఱ్ఱవీగుతున్నాడు. నీవు శ్రీకృష్ణుని యెరుగవా? లేకపోతే తెలిసికూడా భయపడి పిరికిపందవై ఊరుకున్నావా? అని పురికొల్పి కాలయవనుడు మథురాపురం మీద దండెత్తేట్లుగా ప్రోత్సాహపరిచాడు. దానితో కాలయవనుడు మధురపై దండెత్తి ముచుకుందునివల్ల సంహరింపబడ్డాడు. సత్యభామకోరికపై దేవపారిజాతాన్ని శ్రీకృష్ణుడు తీసికొనివచ్చి ఆమె యింటిముందు పెట్టడం నారదుడు కారణంగానే. చెట్టు మాత్రమే అక్కడ ఉండి ఆ పారిజాతవృక్షపుష్పాలన్నీ తెల్లవారేసరికి ప్రతినిత్యమూ రుక్మిణి యింట్లో ఉండడం సుప్రసిద్ధమైన విషయమే.

ఒకనాడు ఇంద్రసభలో రంభాదులు మనోహరంగా గానం చేస్తూ నృత్యం చేస్తుండగా నారదు డక్కడికి వెళ్ళాడు. కొంతసే పైన తరువాత ఇంద్రుడు నారదుణ్ణి చూచి "మునీంద్రా! నీకు యెవరి గానం నచ్చింది?" అని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు "ఎవ్వరు హావభావాలతో విఱ్ఱవీగుతారో వారి సంగీతం బాగుంటుం"దని సమాధానం చెపుతాడు. అప్పుడు నే నెక్కువంటే నే నెక్కువని అప్సరోవనిత లంతా తమలో తాము వాదులాడుకుంటారు. చివరికి వారిలో యెవరు గొప్పవారో నారదుడే నిర్ణయించాలని ఇంద్రుడు కోరుతాడు. అప్పుడు నారదుడు యేవనిత దూర్వాసమహర్షిని చలింపచేయగలుగుతుందో ఆమె గొప్పది అని సమాధానం చెపుతాడు. అప్పుడు వపువు అనే అప్సరోవనిత దూర్వాసుణ్ణి నేను చలింపచేయగలనని వెళ్ళుతుంది. మహాతపోనిమగ్నుడై ఉన్న దూర్వాసమహర్షివద్దకు వెళ్ళి గానం చేస్తూ అతనికి తపోభంగం కలిగిస్తుంది. అప్పుడు దూర్వాసమహర్షి వపువును పక్షిరూపం దాల్చి భూమిమీద జన్మించవలసిందిగా శపిస్తాడు. తరువాత వపువు ప్రార్థించగా భారతయుద్ధసమయంలో అర్జునుని బాణాహతిచే క్షతురాలవై శాపవిముక్తి పొందగలవని అనుగ్రహిస్తాడు.

మహాభారతాన్ని బట్టి నారదమహర్షి మహిమ యెంతటిదో యీ క్రిందికథవల్ల తెలుస్తున్నది.

కొంతకాలం నారదపర్వతు లిద్దరూ సృంజయునివద్ద ఆతిథ్యం పొంది వెళ్ళబోతూ సృంజయుని కేదైనా ఉపకారం చెయ్యాలనే దృష్టితో యేదైనా ఒక వరం కోరుకొమ్మంటారు. అప్పుడు సృంజయుడు "మీ అనుగ్రహం ఉండడంకంటె నాకు