పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేకమందికి అనేకవిధాలైన ఉపకారాలు చేశాడు. స్త్రీల నోట్లో మాట దాగదన్నమాట నిజమో కాదో చెప్పలేము. కాని - స్త్రీల నోట్లో నువ్వుగింజైనా నానదన్నమాట యేమోగాని నారదమహర్షి నోట్లోమాత్రం యేఒక్కమాటకూడా దాగదు. ఎంత రహస్యమైనా గూఢాతిగూఢమైన విషయమైనా సరే తాను ఇతరులకు చెప్పకుండా ఉండలేడు. విష్ణువు రామావతారం ఎత్తబోతున్నట్లు నారదుడే వాల్మీకికి ముందుగా తెలియచెప్పాడు. లోకంలో సామాన్యంగా తగాదాలు పెట్టే వ్యక్తిని నారదు డనడం పరిపాటి. ఇక్కడి వక్కడా అక్కడి విక్కడా చెప్పి తగవులు పెట్టడం నారదుని కొకసరదా. అసలు తగాదాలు పెట్టకుండా నారదు డుండలేడు. అందుకే అతనికి కలహభోజనుడు అనే పేరు వచ్చింది. తగాదాలు పెట్టడం నారదునికి మహదానందదాయకంగా కనిపిస్తుంది. ఇంతటి తగాదాలమారివాడైనా యితని నెవ్వరూ అగౌరవపరచిన సంఘటన లంతగా కనిపించవు. ఒకవేళ నారదుడు ఎటువంటి తగాదా పెట్టినా లోకక్షేమం దృష్ట్యా పెట్టినట్లే కనిపిస్తుంది గాని తద్భిన్నంగా కనిపించదు.

జలంధరాసురుణ్ణి యెంతోమంది దేవతలు ప్రయత్నం చేసి జయించలేకపోయారు. చివరికి వారంతా నారదునితో తమగోడు మొరపెట్టుకున్నారు. నారదుడు అంతా విని తల పంకించి తగిన ఉపాయం ఆలోచిస్తానని చెప్పి వారిని ఓదార్చి సాగనంపి సరాసరి జలంధరుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి అనేకవిధాల అతన్ని స్తుతించాడు. "జలంధరా! నీకు అశ్వరత్నాలూ, గజరత్నాలూ, సౌధరత్నాలూ, యింకా యింకా అనేకం ఉన్నాయి. సమస్తభోగభాగ్యాలూ ఉన్నాయి. కానీ నీకు జాయారత్నం లేదు." అని అసలులోపాన్ని యెత్తి చూపించాడు. "ఆలోపాన్ని నే నేవిధంగా తీర్చుకోవాలి. నా కర్హురాలై సతిగా ఉండదగిన పడతి ఎవ్వరు?" అని జలంధరుడు నారదుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు "శ్మశానంలో ఉండే మహేశ్వరుడికి జగత్సుందరియైన పార్వతి యెందుకు? ఆమెను నువ్వు పట్టుకో" అని సలహా యిచ్చాడు. వెంటనే జలంధరుని హృదయం పార్వతికోసం ఆరాటపడింది. అందువల్ల శివజలంధరులకు యుద్దం తప్పలేదు. ఆయుద్దంలో జలంధరుడు దుర్మరణం పాలయ్యాడు. ఒకసారి నారదుడు గరుడుని వద్దకు వెళ్ళి "నీ బల మెక్కడ! సర్పాల బల మెక్కడ? నిన్ను కన్నతల్లి వారికి దాసిగా ఊడిగం చేస్తూ ఉంటే నీవు మిన్నకుండడం గౌరవప్రదమేనా" అని గరుడుణ్ని పురికొల్పాడు. దానితో గరుడసర్పవైరం యేర్పడి గరుడుడు సర్పవినాశకుడుగా రూపొందాడు. ఉతథ్యుని అర్థాంగిని వరుణుడు యెత్తుకొనిపోగా ఆవిషయాన్ని నారదుడు గ్రహించి ఉతథ్యునికి తెలియచేశాడు. కాగా వరుణుడు ఉతథ్యుని ఆగ్రహానికి గురయ్యాడు.