పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడవికి వెళ్ళి విష్ణువు నుద్దేశించి ఘోరమైన తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమై సారస్వతు నుద్దేశించి నీకేం కావాలో వరం వేడుకోవలసిందని చెప్పగా అప్పుడు సారస్వతుడు శ్రీ మహావిష్ణువు సాయుజ్యాన్నే - నిత్త్యాతిసన్నిహితత్త్వాన్నే అభిలషించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు "నాకు అతిసన్నిహితుడై నాతరువాత ఉండేవాడు బ్రహ్మ. నీవు బ్రహ్మకు పుత్రుడవై జన్మించి నాసాయుజ్యాన్ని పొందగలవు" అని అనుగ్రహించాడు. అంతేకాదు "నీవు పితృదేవతలకు "నారము"ను అంటే నీటిని యెల్లప్పుడూ యిస్తూ ఉంటావు. కాబట్టి నీవు నారదుడవని ప్రసిద్ధి పొందుతావు" అని వరం ఇచ్చినట్లు తెలుస్తున్నది.

భాగవతంలోనే మరొకసందర్భంలో పేర్కొన్నదాన్నిబట్టి చూస్తే అసలు శ్రీ మహావిష్ణువే నారదుడనే దేవర్షిగా పుట్టి కర్మనిర్మోచకమైన వైష్ణవతంత్రాన్ని విరచించినట్లు తెలుస్తున్నది. నారదమహర్షి గురించి భాగవత - వరాహపురాణ - మార్కండేయపురాణాది గ్రంథాలవల్ల అనేకవిధాలైన మరికొన్నివిశేషాలు తెలుస్తున్నాయి. ఆవిశేషాలను సంగ్రహంగా యిక్కడ క్రోడీకరిస్తున్నాను.

"నారదునికి సంసారం కాని సంతతి కాని అసలు లేనేలేదు. అతడు అస్ఖలితబ్రహ్మచారి. అతనికి యేలోకంలోనూ స్థిరత్వం లేదు. ఇందుకు కారణం దక్షుని శాపం. నారదుడు "మహతి" అనే పేరుగల వీణమీద సదా మహావిష్ణునామగానం చేస్తూ త్రిలోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. ఆయాలోకాల్లోని విశేషాలు తెలుసుకుంటూ అవసరమైనవారికి తనకు చేతనైన ఉపకారం చేస్తూ ఉంటాడు. ఆపదల్లో చిక్కుకున్నవారికి భగవద్విలాసాన్ని గురించి చెప్పి వారి హృదయాలలో శాంతి కలుగజేస్తాడు. ఒకప్పుడు అకంపనుడనేవాడు తనపుత్రుడు మృత్యువాత పడగా యేడుస్తుంటే నారదుడు అతనివద్దకు వెళ్ళి మృత్యుస్వభావంగురించి వివరించి అతనికి దుఃఖోపశమనం కావించాడు. సృంజయుడనేవానికి షోడశరాజులచరిత్ర వివరించి అతని విచారాన్ని రూపుమాపి చనిపోయిన సృంజయుని కుమారుని బ్రతికించి తిరిగి అతనికి పుత్రభిక్ష పెట్టాడు. హిరణ్యకశిపుని భార్యయైన లీలావతిని యింద్రుడు సంహరించాలని చూడగా నారదుడు అడ్డుపడి లీలావతి సద్గుణాలనే కాక ఆమెగర్భంలో పెరుగుతున్న మహావిష్ణువుకు పరమభక్తాగ్రేసరుడు కానున్న ప్రహ్లాదునివిషయం చెప్పి ఆమెను సంరక్షించాడు. అవసరమైనప్పుడల్లా ధర్మరాజుకు ప్రత్యక్షమై యెన్నెన్నోహితవులూ, సలహాలూ బోద్ధించాడు. రామలక్ష్మణు లిద్దరూ ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రంతో బంధితులుకాగా నారదుడు వచ్చి గరుత్మంతుణ్ణి ప్రార్థించవలసిందిగా రామలక్ష్మణులకు బోధించి వారిని నాగాస్త్రవిముక్తులను కావించాడు. ఇదేవిధంగా నారదుడు