పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఆరయఁ బరోపకారార్థంబుగా నరుఁ
                       డత్యంతశుభవృత్తి నందవలయు
దీపింప సప్తాంతరీవమధ్యం బేలు
                       సార్వభౌముఁడు హరిశ్చంద్రవిభుఁడు
చండాలమందిరస్థాయియై సుతదార
                       విక్రయ మొనరించి వివిధదుఃఖ
ములఁ బొంది సత్యంబు [1]నిలుపుకొనియె సరో
                       జాసనాదిసువర్వు లభినుతించి


తే. గీ.

వర మొసంగెద మనఁగ భావమునఁ దలఁచి
తరుసరీసృపయువవృద్ధపురుషభామి
నీజనంబులు మత్పురి నేఁడు ముక్తి
నందఁగాఁ దగునని వారి నడిగికొనియె.

219


వ.

తాను నయోధ్యాపురజనంబుతోఁ ద్రిదివంబు నొంది యిప్పుడును
గామగ విమానంబున విహరింపుచు నున్నవాఁడు. పరోపకారంబు
వ్యర్థమే? మఱియును వినుము.

220


క.

అస్థిరతఁ దలఁచి నిర్జరు
లస్థిరతస్ఫూర్తి నడుగ నర్పించఁడె ధ
ర్మస్థుండైన దధీచి వ
నస్థాశ్రమజనము లతిఘనస్థితి మెచ్చన్.

221


తే. గీ.

శ్యేనమున కీఁడె మాంసంబు శిబి కపోత
రక్షణార్థంబు మున్నుగాఁ బక్షిపతికి
[2]జీవనం బొసఁగఁడె నిజచిత్త గరుడ
వాహనుండైన జీమూతవాహనుండు.

222


వ.

అది గావున రాజు దయాళుండు గావలయు. పర్జన్యుండు శుచి
స్థలంబుననేని నశుచిస్థలంబుననేని వర్షించు. చంద్రుండు చండాల
పతితాదులనేని యాహ్లాదకరుండై కరంబులచే స్పృశించు నట్లగుటంజేసి
సుదుఃఖితయై దుర్లిఖితగోధికయైన గృహగోధిక, నిజపుణ్యంబులచేత,
దౌహిత్రులచేత నహుషుండునుంబోలె నుద్దరించెదనని మోహినిని
వారించి విజయాసంభవంబైన సుకృతం బిచ్చితి ననిన నంత.

223
  1. నిలుపుకొని యేను సరోజాసనాది
  2. జీవనం బొసంగండే నిజచిత్త గరుడ