పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ననుఁ గొనియాడకు మో ముని
జననాథ! భవత్పదాంబుజాతపరాగాం
శనిజమహత్త్వము డలదే
జనవిభుఁడ మదాంధుఁడన్ బ్రశంసార్హుఁడనే?

154


క.

ధరణి సురవర్యులం గని
పరితోషము నొంద విష్ణుభక్తి ఫలించున్
ధరణీసురవర్యులఁ గని
పరితోషము నొందకున్న ఫలియించ దిలన్.

155


ఆ. వె

అనిన వామదేవుఁ డనియె నాగృహమున
కరుగుదెంచితివి మహాత్మ! నీ క
భీష్ట మెద్ది? [1]తెలుపు మిచ్చలు హరిదిన
వ్రతపరాయణైకమతధురీణ!

156


వ.

అనిన రుక్మాంగదుండు కరంబులు మోడ్చి యిట్లనియె.

157


సీ.

తాపసోత్తమ! భవత్పాదపద్మంబులు
                       గాంచునంతనె సర్వకామితములు
నాకు లభించె సన్మౌనీంద్ర! యొకసంశ
                       యం బాత్మలో నున్నయది యణంపు
మనఘాత్మ! లోకత్రయాధికసౌందర్య
                       శాలిని మద్భార్య సాధుచర్య
ననుఁ జూచు నవ్యమన్మథునిగా నాసాధ్వి
                       ద్రొక్కినచోట్ల నిధుల్ ప్రకాశ


తే. గీ.

మందు నంటినచోఁ బాప మవియు నగ్ని
పాసి సిద్ధించు షడ్రసబహువిధాన్న
ములు భుజింతురు విప్రకోటులు ధరిత్రి
తన్మహత్త్వంబు చెప్పఁ జిత్రంబు కాదె!

158


తే. గీ.

బ్రాహ్మణోత్తములును విష్ణుభక్తులును జ
రాంధులును రోగులును వచ్చి యాశ్రయింప
నాత్మఁ గరఁగు నవజ్ఞ సేయదు తదీయ
వాక్యములు ద్రోయదు విశిష్టవర్తనమున.

159
  1. తెలుపు నిచ్చలు