పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బిరుదుజల్లులు వైచిన కైవడి విజృంభించె. ఒక్కరుండు భల్లుకంబుం
గవయించుకొని యీడ్చి కంటకలతాకుంజంబుల వత్సంబులంబోలెఁ
దదీయశిలాలతికలం గట్టివైచె. ఒక్కరుండు వ్యాఘ్రనఖంబుల శశంబు
శిరోభాగంబునం గ్రుమ్మి విషాణంబులు గల్పించె. ఒక్కరుండు
కురంగనాభిస్థలంబు నఖంబులం జీరి తన్మదధారలు పయిం జల్లుకొని
వీరరసావేశంబు దాల్చినట్లు రాణించె. ఒక్కరుండు గైరికారక్తగాత్రుండై
శిఖావంతుండై లోహితాశ్వుం డయ్యె. ఒక్కరుండు గండకంబుల వంశ
లతావలయంబులు దూలించి నర్తింపంజేసె. ఒక్కరుం డెట్టు మెకంబుల
నేని కరచి విదళించి శరంబునం గ్రుమ్మి కరంబునం జిమ్మి
యురంబునం గ్రమ్మి విజృంభించె. ఇట్టు చలాచలలక్ష్యభేదులై నిషాదులు
ముందఱ మార్గంబు చూపఁ బక్కణంబులఁ గుంజాగ్రంబుల నారవైచిన
పలలంబు లంటిన చామరంబులును, సంకుమదపల్వలంబులును,
బ్రోవులైన కస్తూరికాపంకంబులును, గొండలైన కరిమౌక్తికంబులును,
నేరులైన నానాఫలధాతుసధారలును, బడి మొలచిన కప్పురంపుటనంటి
మొక్కలును గలుగం జూచుచు మృగయావిహారంబు సలిపిన యట్లనె
యేఁగుచు మున్యాశ్రమంబులు దాఁటి యష్టోత్తరశతయోజనంబులు
గడచి కదలి యశోకనాగపున్నాగవకుళనారికేలసాలరసాలకంద
రాలసింధువారచందనస్యందననీపలోధ్రకలిద్రుమప్లక్షబదిరాది
నానాతరుశోభితంబై సుగంధిగంధవాహబంధురంబైన యొకయాశ్ర
మంబున హుతభుక్తేజులగు మునిరాజుల వీక్షించి తురంగమంబు డిగ్గి
బహుశిష్యసమేతుండైన వామదేవునిం గాంచి దండప్రణామం బొన
రించిన నతండు కుశాసనంబు వెట్టించి యర్ఘ్యపాద్యంబు లిప్పించి
యిట్లని వినుతించె.

150


మ.

ఫలియించెన్ దపముల్ ఫలించె హుతముల్ పాత్రైకదానంబులున్
ఫలియించెన్ ఫలియించె సత్క్రియలు శ్రీపద్మాధిపార్చావిధుల్
ఫలియించెన్ ఫలియించె మజ్జననసంపద్భాగ్యసౌభాగ్యముల్
ఫలియించెన్ నిను విష్ణుభక్తినిధి భూపాలాగ్రణిం జూచితిన్.

151


తే. గీ.

మహి సుకర్మస్థులును వికర్మస్థులును మ
హాత్మ! నీదు వ్రతంబున హరిపదంబు
గనిరి నినుఁ జూడఁ జిత్త ముత్కంఠఁ జెందు
నంతలోననె ప్రత్యక్షమైతి భూప!

152


వ.

అని వామదేవుం డానతి యిచ్చిన రుక్మాంగదుం డిట్లనియె.

153