పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

పాదశౌచంబు స్నాన మభ్యంజనంబు
తత్స్నుపాహస్తమునఁ జేయఁదగదు చేసె
నేని యాపాపశీలుని మేను దొలఁచు
కూటముఖకీటకంబు లక్షోభ్యశక్తి.

88


వ.

అదిగాన సాభిలాషమానసంబున స్వసుతనేని వీక్షించినఁ బతితుం డగు.
రుచిరనాసావిలాసంబగు వట్రువమొగంబు శ్లేష్మాగారం బనియు,
మేను వసామేధశ్చర్మమాంసావృతంబైన యస్థిపంజరం బనియును,
నయనంబు లశ్రుబుద్బుదంబు లనియు, స్తనంబులు మాంసగ్రంథు లనియు,
జఠరంబు మలమూత్రపూరం బనియు, జఘనం బుదగ్రమాంసఖండం
బనియు, గుహ్యం బపానవాయుజుష్టమాత్రం బనియు, జంఘలు చర్మ
భస్త్రిక లనియు, నాభి నరకకూపం బనియు; నంగుళవితానంబు మాంస
కణిక లనియు వితర్కింపక నరుం డిట్ల వర్తిల్లెడు నని విరించి వివరించి
ధైర్యం బవలంబించి యాబాలికం జూచి యిట్లనియె.

89


క.

మనసునఁ దలఁచిన యట్లనె
జనియించితి శుభవిలాససంపద ని న్నే
మన సునయన కల్పించితి
మనసునకున్ మదనమోహమాయామహిమల్.

90


వ.

అనిన నమ్మానసకన్య నవ్వి యవ్విరించికి మ్రొక్కి యిట్లనియె.

91


మ.

సకలస్థావరజంగ మాత్మకజగజ్జాలంబు మద్రూపరే
ఖకు మోహింపకయున్నె [1]నీవు నెదలోఁ గంజాతసంజాతభా
వుకముల్ గోరెదరేని ధర్మగణితవ్యుల్ భవ్యు లాత్మస్తుతుల్
ప్రకటస్ఫూర్తి నొనర్చిరేని నరకప్రాప్తుల్ గదా మీఁదటన్.

92


తే. గీ.

అయినఁ గార్యనిమిత్త మే నబ్జజాత
చెల్లు నాత్మప్రశంసలు చేయ, సకల
మోహమూలంబుగా నీవు మొదల నన్ను
నిట సృజించితి విటఁ బని యేమి నాకు.

93
  1. నీవు నొదలో కంజాంతసంజాతభావుకముల్