పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

హరివాసరమునఁ గుడిచిన
పురుషుల కిలలోని పాపములు ప్రాపించున్
హరివాసరమునఁ గుడువని
పురుషుల కిలలోని పుణ్యములు ప్రాపించున్.

38


ఆ. వె.

వైమనస్య మందె వైవస్వతుం డంతఁ
జిత్రగుప్తలేఖ్యపత్రలిఖిత
దురితపుణ్యు లిపుడు [1]తుడుపులు వడిరి త
ద్విష్ణుదివసమహిమ వింతకాదె!

39


క.

హరిలోకమునకు నేఁగఁగ
సురపురమును యమపురంబు శూన్యం బయ్యెన్
సురముని [2]నారదుఁ డొయ్యన
నరుదెంచి కృతాంతుఁ జూచి యపు డిట్లనియెన్.

40


తే. గీ.

చిత్రగుప్తుఁడు నున్నాఁడు [3]చిన్నవోయి
నరులు పావనులైరి నీపురమునందు
యాత నాక్రందములు వొంద వనఘ ధర్మ
రాజ! యిది యెంచి చూడఁ జిత్రంబు గాదె!

41


వ.

అనిన[4] రుక్మాంగదక్షితీశ్వరుం డేకాదశీవ్రతంబు సేయుచుండ నీ
రాష్ట్రంబులోఁ జాటించ నట్లనె నరులు వర్తించఁ దన్మహత్త్వంబున
మల్లోకం బిట్లయ్యె. బ్రహ్మహత్యాదిపాతకాన్వింతుడైన సింహంబువలె
నున్నవాఁ డేను కాష్ఠమయుండనై యున్నవాఁడ; నేత్రకర్ణహీనుండునుం
బోలె, సంధ్యాహీనుఁడైన ద్విజుండునుంబోలె, స్త్రీజితుండైన పురుషుం
డునుంబోలెఁ; బ్రమదాపతి యగు షండుండునుంబోలె నిర్విణ్ణుండనై
యున్నవాఁడ, నిటువంటి లోకపాలకత్వంబు విడిచెదనని బ్రహ్మ
లోకంబునకు నేఁగి యేతత్కార్యంబు విన్నవించెద. స్వామివిత్తం బను
భవించి స్వామికార్యంబునెడ నిర్వ్యాపారుండై యున్నవానికి నరకం
బగుం గావున.

42
  1. తుడుపులు పడియెఁ ద | ద్విష్ణుదివస మహితు వింతకాదె.
  2. నారదుఁ డొయ్యని యరుదెంచి
  3. చిన్నబోయి
  4. (‘న' కొట్టివేయఁబడినది.)