పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

వినుము రాజేంద్రా! ఏకాదశీసముద్భవానలంబుచే జన్మశతోద్భవంబు
లైన పాతకేంధనంబులు భస్మంబగు. హరిదివసంబువంటి దివసంబు
లేదు. హరివాసరంబున నుపవసించు తన కనేక[1]దేహంబుల పాపంబు
లుడుగు. హరివాసరోపవాసషోడశాంశంబునకు నశ్వమేధ
సహస్రంబులు వాజపేయశతంబులు సమంబులు గావు. హరివాస
రోపవాసంబున నేకాదశేంద్రియకృతపాపంబులన్నియు నాశంబు
నొందు. హరివాసరసమంబుగాఁ బాపంబులవలన రక్షించునది
యొక్కటి లేదు. ఒక్కొక్కవ్యాజంబున హరివాసరోపవాస మాచ
రించి దండధరునిం జూడఁడు. స్వర్గమోక్షప్రదంబును, శరీరారోగ్య
కరంబును, సుకళత్రసుపుత్రలాభకారణంబును[2] నగు. మఱియును.

5


క.

కురుగంగాకాశీపు
ష్కరరేవావేణికావికర్తనతనయా
సరయూగయాదితీర్థము
లరయన్ సరి యనఁగఁ దగునె హరిదినమునకున్.

6


మ.

అవనీనాయక! కల్గు లోకుల కనాయాసంబునన్ నేఁడు వై
ష్ణవధామం బుపవాసజాగరము లిచ్చంజేయ నేకాదశిన్
సవిశేషంబుగ మాతృపక్ష పితృపక్ష స్వప్రియాపక్ష వం
శవతంసంబులు వార్తగాఁ బదియు మోక్షం బందుఁ దానుం దగున్.

7


క.

ఏకాదశి చింతామణి
యేకాదశి కామధేను వింద్రమహీజం
బేకాదశి మోక్షప్రద
మేకాదశి వేదమార్గ మేకాదశియే.

8


శా.

ద్వాదశ్యుత్సవ మాచరించు నరుఁడు ద్యద్దోశ్చతుష్కంబుతోఁ
గాదే నాహితదివ్యవాహనముతోఁ గౌశేయవస్త్రంబుతో
నాదిత్యుల్ గొనియాడ నాహరిపురోదంచన్మణీవేదికన్
మోదం బందుచునుండు వైష్ణవసభాముఖ్యుల్ ప్రశంసింపఁగన్.

9
  1. దేహంబునం బాపంబు లుండు
  2. ('ను' లేదు.)