పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

నారదీయపురాణము

చతుర్థాశ్వాసము

క.

శ్రీమన్నాగ్నజితీప్రే
మామోదాంభోధిపూర్ణిమాంబుజహరసు
త్రామసుతసూతకృత్యభి
ధాముహురాఖ్యాతపుణ్యదాక్షిణ్యగుణా!

1


వ.

అవధరింపుము నైమిశారణ్యవాసులగు మహామునీంద్రులకు సూతుండు
మఱియు నిట్లనియె. మున్ను మాంధాత వసిష్ఠు నడిగిన యేకాదశీ
వ్రతంబు మీకు నెఱింగించెద వినుండు.

2


క.

ఏపున శుష్కార్ద్రములౌ
పాపేంధనకోటులెల్ల భస్మము సేయన్
దీపించు వహ్ని యెయ్యది
తాపసకులనాథ! తెలుపు దయతో మాకున్.

3


సీ.

మూఁడులోకంబుల మునినాథ నీ వెఱుం
                       గనియది లేదు నిక్కముగఁ ద్రివిధ
కర్మ నిశ్చితము విఖ్యాతిమైనఙ్ఞాత
                       కలుషంబు లెంచ శుష్కములు జ్ఞాత
కలుషంబు లార్ద్రముల్గా విన్నవించితి
                       వార్త కెక్క నతీతవర్తమాన
భావికాలోచితపాపేంధనంబు లే
                       వహ్నిచే నడఁగుఁ బావనచరిత్ర


తే. గీ.

యనిన హరివాసరము నియతాత్మ మనుజుఁ
డుపవసించి హరి భజించి యుచితభక్తిఁ
గాంచి నిశినెల్లఁ దా మేలుకాంచి ధనము
జూదరియుఁ బోలెఁ బాతకస్తోమ మడఁచు.

4