పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యోగ్యత సంపాదించుకుంటాడు. ఇటువంటిశక్తు లేమీ సంపాదించకుండానే ఆయావాక్యాలను ఉచ్చరించడం ఆర్షవిజ్ఞానసమ్మతం కాదు.

నరసింహకవి పౌండ్రకవాసుదేవుని సంహారసందర్భంగా యీ క్రిందిపద్యం వ్రాయడం యెంతోసముచితంగా ఉన్నది.

చింతించి "యచ్యుతో౽హమ
నంతో౽హం హరిరహమ్మురారి రహం శ్రీ
కాంతో౽హ"మ్మను నాతని
నంతం బందించె దానవాంతకుఁ డంతన్
                 (నార. 337 పుట.76 ప)

దీని వల్ల ఒక్కసన్యాసులే కారు యెంత మహాశక్తిసంపన్ను డైనా సరే ఆమహావిష్ణుశక్తిసముచ్చయాన్ని సంపాదించకుండా 'అచ్యుతో౽హం" వంటివాటి నుచ్చరించరాదని స్పష్టపడడం లేదా? ఒకవేళ వారు ఉచ్చరించినా పాపాత్ము లైతే సంహారయోగ్యులేనని తేలడంలేదా? కాగా వేదవాఙ్మయాన్ని ప్రతిబింబించిన ఆర్షవిజ్ఞానసాంకేతికాత్మకాలైన పురాణా లేవైనా సరే ఒకే ఒక్కకోవకు చెందినవనీ ఏకైకపరమార్థం కలవనీ మనం సత్యసమ్మతంగా భావించవలసి ఉంటుంది.

నారదుడు

నారదీయపురాణకర్త యైన నారదుణ్ణి మామూలుగా మనం మహర్షి అనుకుంటాంకాని అతడు మహర్షిమాత్రుడే కాడు. అసలు దేవర్షి. త్రిలోకసంచారి. త్రికాలజ్ఞుడు. మామూలుగా మనం శ్రీ మహావిష్ణువును జగన్నాటకసూత్రధారి అని అంటాం కాని లోతుగా పరిశీలిస్తే నారదమహర్షికూడా ఒక విశిష్టత కల జగన్నాటకసూత్రధారిగానే మనకు దృగ్గోచర మవుతాడు. దాదాపు నారదునిపాత్ర లేకుండా యేదుష్టసంహారమూ, యేశిష్టరక్షణా లేదనియే చెప్పవచ్చును.

నారదుడు బ్రహ్మకంఠప్రదేశంనుంచి సంజనితు డయ్యాడని బ్రహ్మవైవర్తపురాణం పేర్కొనగా బ్రహ్మతొడనుంచి ఆవిర్భవించాడని భాగవతం పేర్కొన్నది. బ్రహ్మవైవర్తపురాణంలోనే వేరొకచోట బ్రహ్మ దనపుత్రికయైన ప్రియను వివాహం చేసుకోగా ఆప్రియాబ్రహ్మలకు నారదుడు సంజనితుడైనట్లు మరొకవిధంగా ఉన్నది. భాగవతప్రవచనం ప్రకారం చూస్తేనే నారదునిజన్మ యింకొకవిధంగా వేరొకచోట కన్పిస్తున్నది. అది యిది. ఉపబర్హణుడు