పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని హరిహరులకు అభేదం చాటడం జరిగింది. ఇదేవిధంగా మరొకసందర్భంలో శివకేశవులకు అభిన్నత్వాన్ని చెప్పినవారికి, భావించినవారికి ఇహపరసౌఖ్యాలతోపాటు మోక్షప్రాప్తికూడా కలుగుతుందని పేర్కొనడం జరిగింది. హరిహరుల అభిన్నత్వాన్ని వేదవాఙ్మయంతోపాటు పురాణవాఙ్మయంకూడా చాటుతున్నప్పుడు ప్రత్యేకించి విష్ణుతత్వబోధకాలని, సాత్వికాత్మకాలని, భావించబడిన ఆరుపురాణాలలో వొకటైన నారదీయపురాణంలోనే హరిహరుల అభిన్నత్వాన్ని చాటడం జరిగినపుడు శివతత్వప్రబోధకాలైన పురాణాలు తామసాత్మకాలనీ, పరిత్యాజ్యాలనీ యేమెమో వ్రాయడం అనార్షేయం కాదా? అవైజ్ఞానికం కాదా? అప్రామాణికం కాదా? ఇంతెందుకు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ముగ్గురికి అభిన్నతత్త్వాన్ని చాటుతూ యేర్పడిందే కదా దత్తాత్రేయమూర్తిత్త్వం. ఈదత్తాత్రేయత్వం సైతం అత్యంతప్రాచీనతరమైనదే కాని కొంద రనుకునే పురాణకాలపునాటిది కానేకాదు. ఈదత్తాత్రేయత్త్వాన్ని శాస్త్రీయంగా కాని ఆర్షవిజ్ఞానపరంగా కాని కాదని త్రోసిపుచ్చగలవారు లేరు. కాగా అసలు దేవతలలోనే సత్వరజస్తమోగుణాల ప్రాధాన్యత లేనప్పుడు పురాణాలలో సాత్విక - రాజస - తామస భేదాలను యేవిధంగా కల్పించగలము?

"తత్త్వమసి త్వమసి తత్" - "సోహం హంసః" - అన్న వేదార్దప్రతిపాదకవాక్యాల అంతర్యాన్ని గుర్తించినవారు బ్రహ్మవిష్ణుమహేశ్వరుల విభిన్నత్త్వాన్ని పరిగణించలేదు. "శివో౽హం," "అహం బ్రహ్మాస్మి," "విష్ణ్వహం" వంటి అర్థాద్వైతవాక్యాలను కాకుండా "శివో౽హం, అహమేవ శివః - "అహం బ్రహ్మాస్మి - బ్రహ్మఏవ అహమస్మి," "విష్ణ్వహం, అహమేవ విష్ణుః," వంటి పరిపూర్ణసార్థక ఆర్షవిజ్ఞాన అద్వైతవాక్యాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించినప్పుడు త్రిమూర్తుల మతవిభేదాలను విజ్ఞులెవరూ పరిగణనలోకి తీసుకొనబోరు. అద్వైతసిద్ధాంత మన్నది ఆదిశంకరులు క్రొత్తగా రూపొందించిన సిద్ధాంత మేమీ కాదు. అనంతమైన వేదవిజ్ఞాన అంతర్యాన్ని గుర్తించి ప్రవచించబడిన మతమే కాని అద్వైతమతం వేదభిన్నమైన అపూర్వమత మేమీ కాదు. అసలు శివో౽హం, అహం బ్రహ్మాస్మి - విష్ణ్వహం వంటి మాటలు యెవరు పడితే వారు ఉపయోగించడానికి వీలైనవి కావు. కొంతకాలంగా కాషాయాంబరధారులైన ప్రతివారూ వీటిని ఉచ్చరిస్తూ ఉండవచ్చునుగాని అవి సార్థకంగా అతిప్రాచీనకాలంనుంచీ ఉపయోగించబడడం లేదు. వాస్తవానికి శివపరమైన శక్తు లన్నింటినీ సంపాదించినవాడే "శివో౽హం" అనడానికి అర్హు డవుతాడు. బ్రహ్మపరమైన శక్తులన్నీ తనవశం చేసుకొనగలవాడే "అహం బ్రహ్మాస్మి" అనడానికి సమర్హు డౌతాడు. ఇదేవిధంగా విష్ణుశక్తు లన్నింటినీ సాధించగలిగినవాడే "విష్ణ్వహం" అనడానికి