పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఆశ్రమోపగతంబైన సంపదం గాంచి యుంఛవృత్తి మునీంద్రులఁ
దృప్తిఁ బొందించునంత వారు భుజించి సుఖాసీనులై యున్న లజ్జించి
యతిథిప్రియుం డచటికి వచ్చి భయంబున వందనంబు చేసిన వానిం
జూచి విశ్వామిత్రుం డిట్లనియె.

147


తే. గీ.

ఉంఛవృత్తికి దారిద్య్ర మొసఁగ నేమి
గలదు మందిరమున? నని గర్వవృత్తి
నగితి మముఁ జూచి పరమవైష్ణవులయింటఁ
గమలగేహ వసించుట కానవైతి.

148


క.

శ్రీనారాయణుఁ డుండఁగ
దీనాత్ముని వేఁడుకొనుట [1]దీవించిన క
ల్పానోకహ ముండఁగ మది
యానక శాల్మలినిఁ దలఁచి [2]యాచించు టగున్.

149


క.

నారాయణుఁ డుండ దురా
చారులఁ గొల్చుట సుధాబ్దిసంగతి మదిలోఁ
గోరక లవణాకరసీ
మారతి విహరించుటలు క్రమంబునఁ దెలియన్.

150


ఆ. వె.

మాధవాంఘ్రియుగము మఱచి వేఱొక్కని
రక్షకుం డటంచు భ్రాంతిపడుట
స్వర్ణదీతరంగజల మగ్రమున నుండ
మరుమరీచికాంబుమగ్ను లగుట.

151


క.

హరిఁదక్క నితరు నొక్కరు
శరణం బని తలఁచుటెల్ల సారతరంబై
తరి గలుగ భిన్నకుంభాం
తరమున నది దాఁట నాత్మఁ దలఁచుట గాదే!

152


క.

కమలావిభుండు దొరకఁగ
నమరాధము నొకనిఁ జేరి ప్రార్థించుట యు
త్తమచింతామణి [3]దొరకఁగ
నమితములగు చిరిపిఱాల కాశించు టగున్.

153
  1. దీపించినఁ గ
  2. యాశించు టగున్
  3. దొరకిన