పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

మద్గృహమున [1]భుజింపుఁ డామ్నాయమూర్తు
లయిన మీర లటంచు నత్యంతనియతి
[2]నతఁడు ప్రార్థింప వానిపై నాదరంబు
వదలి యందఱు నని రేకవాక్యమునను.

141


మ.

హరిపారాయణవృత్తి లేని భవదీయాగారమధ్యంబునన్
ధరణీదేవ భుజింపనొల్లము సముద్యత్ప్రీతిమై దేవతాం
తరమంత్రాంతరసాధనాంతరము లాత్మం బాయు నవ్వైష్ణవాం
కురముల్ బాంధవు లెంచ మాకు నతియోగ్యుల్ గారు సంకీర్ణకుల్.

142


క.

కరవీరభుక్తి దేహ
స్ఫురణంబు హరించునట్లు పురుషోత్తమసం
స్మరణంబు లేని గృహముల
నరులు భుజింపంగ నాత్మనాశన మరయన్.

143


తే. గీ.

మేలు దేహంబు విడుచుట మేలు వహ్ని
శిఖల మ్రగ్గుట శ్రీపతిసేవ లేని
జడునిగేహమునందు భోజనము సేయ
మేలు గాదు జనంబులు మెచ్చ రచట.

144


వ.

అని యతిథిప్రియునిం బలికి యుంఛవృత్తి గృహంబునకు నేఁగ సంప
న్నుండనగు నాగృహంబు విడిచి యతిదీనుండగు నుంఛవృత్తి గృహంబు
నకు నేఁగి యేమి భుజించెదరో యని యతిథిప్రియుండు నవ్వె. నంత
నుంఛవృత్తి వారలం జూచి పరితోషంబు నొందె. లబ్దతుష్టయను పేరి
తత్పత్నియు నామునుల నవలోకించి చింతావ్యాకులయై కందమూల
ఫలాదికంబులవలనన పరితృప్తిం బొందించెదనేనకించన నని
వితర్కించునంత.

145


తే. గీ.

అప్పు డింద్రాదిదివిజులకైనఁ గోరఁ
దగిన సంపద గలిగె నత్యంతమహిమ
నీరజేక్షణభక్తులు నియతు లెందు
నుండ్రు సంపద లచ్చోట నుండు నిజము.

146
  1. భుజియింపుఁ డా
  2. ననుచుఁ బ్రా