పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

సగరపుత్రులు రాజ్యసంపన్మదంబునఁ
                       గపిలరోషాగ్నిశిఖాప్రదగ్ధు
లగుట మాంధాత గర్వాంధుఁడై లవణదై
                       త్యోగ్రశూలాహతి నుక్కడంగి
యుండుట పౌలస్త్యు నొడిసి [1]బంధించిన
                       కార్తవీర్యుని భుజాగ్రములు పరశు
ధార ద్రుంగుట ధరాధ్యక్షులు ముయ్యేడు
                       మాఱులు సమయుట మహితకీర్తి


తే. గీ.

బలి రసాతలమునఁ గ్రిందుపడుట నహుషుఁ
డజగరంబయి నాకలోకాధిపత్య
ముడిగి వచ్చుట తెలియవే యో నృపాల!
యొల్ల నీకన్య రాజ్యంబు నొల్ల నింక.

76


చ.

వలసినవాని కిమ్ము నృపవల్లభ నీసుత నంగరేఖ దాఁ
గలిగిననేమి? నాకు నది గానఁ గనయ్యెఁడు చర్మభస్త్రికా
తులఁబలలాంత్రశల్యములతో నతిహేయదురుగ్రవాసనా
కలితత రోఁతయయ్యెడు నికం బలుమాఱు వచింప నేఁటికిన్.

77


వ.

నృపా! నేను వైకుంఠసామ్రాజ్యంబుపై మనంబు గల్గి వర్తింపుచున్నవాఁడ
ననిన రాజు సంతోషంబు నొంది చనియె, నంత బ్రహ్మచారి యుగ్ర
తపంబు సేయ నింద్రుండు కలంగి శతాప్సరోజనంబుల నియోగించిన.

78


సీ.

తళతళ మెఱసె మందారమాలిక రంభ
                       యొయ్యారమునఁ (జూచె) నూర్వశి కుచ
కలశముల్ మెఱయించెఁ గల్యాణకౌముది
                       కన్ను లల్లార్చ [2]యగ్రమునఁ బొలిచె
నుద్యానమాలిని యుప్పొంగె మేనక
                       యమృతంబు వెదచల్లి యాననమునఁ
బయ్యెద నెరిజాఱఁ బరతెంచె వీణావి
                       నోదిని హరిణి యామోదభరము

  1. ఖండించిన
  2. యుగ్రమున