పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

తులసిన్ సకలమనోరథ
ఫలదాయినిఁ దెచ్చి విష్ణుపాదాంభోజం
బులఁ బూజించెన్ హరికృప
గలిగెం దత్క్షణమునందె క్ష్మాపాలునకున్.

53


క.

తులసీతులసీమాంతర
ముల [1]నెందును బొంద రఖిలపుణ్యనిధానం
బల భూతభావివస్తువు
లిలలోఁ దత్సదృశవస్తు వెద్దియుఁ గలదే?

54


క.

తులసీకాననసౌరభ
కలితంబగు మారుతంబు గలచో యమదూ
తలు దిరుగ వెఱతు రుర్వీ
తలమునఁ దత్తులసిఁ బోలు ద్రవ్యము గలదే?

55


క.

తులసీ తులసీ యనుచున్
బలుకు నరోత్తముఁడు పరమపదమున లక్ష్మీ
లలనావల్లభపాదో
ల్లలనాకలనాదిసత్ఫలంబు వహించున్.

56


సీ.

దర్శనశ్రవణకీర్తనపరిస్పర్శన
                       స్మరణంబు లొనరించు జనులనెల్లఁ
దులసీవనము పవిత్రులఁ జేయు వెనుకటి
                       పదితరంబులు మీఁది పదితరములు
తులసీదళంబు లెందు వసించుఁ బద్మవ
                       నంబు లెచ్చటనుండు నలిననాభ
కీర్తనం బెందున వర్తిలు భాగవ
                       తోత్తము లేవంక నుంద్రు విష్ణుఁ


తే. గీ.

డచట వసియించు శంఖచక్రాబ్జశార్ఙ్గ
హస్తుఁడై సర్వలోకప్రశస్తుఁడై స
మస్తుఁడై కాన నీవును మనుజవర్య!
శ్రీధరార్చన తులసిచేఁ జేయవలయు.

57
  1. నెద్దియ?