పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భగవద్దర్శనము చేయు విధానము

తే. గీ.

ఎంచ నారాయణునకంటె నితరదేవుఁ
డనుపమాష్టాక్షరంబైన యట్టిమంత్ర
మౌళికంటెను మఱియన్యమంత్ర మిందు
గురునకంటెను వేఱొకగురుఁడు గలఁడె?

51


వ.

వినుము రాజ! ఏకవస్త్రంబుఁ గట్టి ప్రణామంబు సేయుట, వస్త్రంబు
వలెవాటు వైచుకొని మ్రొక్కుట, తైలా[1]భ్యంజనమున భజించుట,
కృష్ణకంబళధారణంబున నీక్షించుట, నఖకేశాదివిక్షేపంబునం
గాంచుట, యెదుట నిష్ఠీవనాదికంబు లొనర్చుట, పర్యంకబంధ
కరణంబున మెఱయుట, [2]యాసనపరివర్తనంబున విజృంభించుట,
[3]యాసనపరిగ్రహంబున వర్తించుట, లాలావిసర్జనంబున, విష్ణు
కథాశ్రవణరాహిత్యంబున, సంధ్యాహైన్యంబున, ననాచారంబున,
నస్నాంబున, నన్యదేవతాగీతపుష్పార్చనంబున, నన్యదేవతా
ప్రశంసంబున, విష్ణుముఖావలోకనంబు సేయక యన్యముఖావ
లోకనంబు సేయుచుండుటను, బానప్రదేశంబున విష్ణుభక్తీతరోపచా
రంబున, శ్మశానంబునకు నేఁగి స్నానంబు చేసియేనియు నర్చించుట,
మూర్ఖప్రదేశంబున నైవేద్యవీక్షణంబున, నివేద్యకుసుమాఘ్రాణం
బునఁ బూజాద్రవ్యాపలాపంబున, నిజబద్ధప్రలాపంబున, భగవ
ద్గృహంబున నుండి ప్రమత్తుండై తనయున్నచోటికిం భగవంతునిం
దెప్పించుకొనుట, కలహప్రవర్తనంబున నేతద్దేవతాద్రవ్యం బన్య
ప్రదేశంబునం బొందించుట, దుష్టుభాజనంబుల సమర్పించుట, లేవక
ప్రసాదంబు స్వీకరించుట, భగవత్సన్నిధి శయనాదికంబుఁ గావించుట,
తులన్యవమానంబు సంఘటించుట, యనర్హప్రసూనంబులం బూజించుట
యన్యులకు రహస్యం బెఱింగించుట, పుత్రాదిచింతనంబున, స్త్రీ
సంభాషణంబున, విష్ణగీతాన్యగీతోపలాలనంబున, విష్ణుమందిరంబునం
బ్రవర్తించుట యపచారంబుల తదపచారంబులం బ్రహ్మకల్పంబులు
నరకం బనుభవించు. ఈశ్వరుండు తత్పూజయుం గైకొనం డీదోషంబు
లలో నొకటి యెయ్యదియైన నీయందుఁ గలిగెనో కాక యనిన విని
రాజు కౌతూహలంబున.

52
  1. భ్యజనమున
  2. నాసన
  3. ఆసన