పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

నపుడు నైవేద్య మర్పించె నామహీత
లాధినాథుండు నారాయణాద్రినాథు
భక్తిఁ బూజించి యన్నంబు బ్రాహ్మణులకు
నెమ్మితోడ నొసంగి మన్నించి మించి.

45


తే. గీ.

సౌధభాగంబు నాసార్వభౌముఁ
డుచితసద్గోష్ఠి వర్తింపుచున్నయెడను
వచ్చి రిరువురు గంధర్వవరులు మింట
యదుగిరీంద్రునిఁ బాడుచు నద్భుతముగ.

46


వ.

రత్నాంగద విచిత్రాంగద నామంబులం బ్రసిద్ధులగు నాగంధర్వ
వరులు నారాయణుండు రాజదత్తసువర్ణకుసుమాదికం బంగీకరింపక
యాధాలాభదత్తంబైన తులసికామాలికయె మౌళియందుఁ దాల్చెననుచు
నేఁగునెడఁ దద్వార్త విని ధర్మకేతుండు నారాయణసన్నిధానంబుఁ జేరి
యట్లనె విలోకించి విస్మయంబంది యాధాలాభుని యున్నకడకుం జని
మ్రొక్కి మధువిరోధి తత్పూజఁ గైకొనుటయు నిజపూజం గైకొనకుండు
టయు నెట్లయ్యెననిన నతం డిట్లనియె.

47


తే. గీ.

ఏ దరిద్రుండ నర్థింప నెఱుఁగ నెట్లు
వాసుదేవుని [1]మెప్పించువాఁడ నెట్టి
ధర్మ మొనరింప శక్తుండ ధరణినాథ
ధరణితలమున నీ కిట్లు [2]తగును గాఁక.

48


వ.

అదియునుంగాక యాపరాత్మ తా నేమి సంకల్పించుకొనియుండునో
యది తానె కల్గుచున్నయది. కించిత్తేని యకృతమయిన యది యపే
క్షించఁడు గావున మహారాజా! నీచేతం జేయఁబడినయది చూడంబడక
యుండుట నిజం బనిన మఱియుం బ్రార్థించిన [3]నిట్లనియె.

49


మ.

తులసీమాలిక వైచి విష్ణునకు సంతోషంబుఁ బుట్టించి [4]ని
చ్చలు నైవేద్య మొసంగి వందనములున్ సద్భక్తి గావించుచున్
[5]లలి నష్టాక్షరమంత్రరాజమున నుల్లం బుల్లసిల్లంగ ను
జ్జ్వలనిష్ఠాప్తి జపంబు సేయుదు మహోత్సాహంబు దీపింపఁగన్.

50
  1. మెప్పింపువాఁడ
  2. చెల్లుఁగాక. (యతి?)
  3. మరియు నిట్లనియె.
  4. నిశ్చలు
  5. ప్రోల్లసదష్టాక్షర (ప్రాసభంగము)