పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తామసగుణతత్వప్రతిపాదకాల పేరుతో జరిగిన పురాణగౌరవ, అగౌరవప్రదమైన నిర్ణయం సత్యాన్వేషణాపరమైనది కాదు. అసలు సత్యావిష్కరణాపరమైన దంతకంటే కాదు. వేదాలన్నింటిలోనూ సాత్విక, రాజస, తామసాత్మకాలైన వివిధమంత్రా లున్నాయి. ఈమంత్రాలు దేవాధిదేవతలైన కేవల విష్ణుబ్రహ్మమహేశ్వరులకు సంబంధించినవి మాత్రమేకాదు. తదితరదేవతలకు సైతం సంబంధించినవిగా వున్నాయి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సృష్టిస్థితిలయకారకు లన్నప్పుడు లయకారకత్వం మహేశ్వరపక్షం కలది కాబట్టి, మహేశ్వరుణ్ని తామసాత్మకుడుగా కొందరు భావించివుంటారు. సృష్టికారకత్వం బ్రహ్మది కాబట్టి సృష్టిలో మంచి చెడు లన్నింటికి స్థానం వున్నది కాబట్టి కేవల వినాశకారిత్వాన్ని బ్రహ్మకు ఆపాదించలేక బ్రహ్మను రాజసాత్మకునిగా పేర్కొని వుంటారు. అటు సృష్టివ్యవస్థకు, యిటు లయవ్యవస్థకు సంబంధం లేకుండా సృష్టియొక్క కేవల స్థితివ్యవస్థకే విష్ణువు పరిమితుడు కాబట్టి, విష్ణువును ప్రత్యేకదృష్టితో సాత్వికస్వరూపుడుగా భావించివుంటారు. అయితే అసలు సృష్టికి మూలభూతు డనిపించుకుంటున్న బ్రహ్మను సృష్టించడానికి మూలం ఆ శ్రీ మహావిష్ణువే కదా! విష్ణువుకు యిచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి చూచినా బ్రహ్మమహేశ్వరు లిద్దరికంటే విష్ణువు గొప్పవాడు మాత్రమే కాదు, వారిద్దరికీ కూడా మహావిష్ణువే మూలభూతుడు. కాగా మహావిష్ణుకారకత్వానికి చెందని రాజసతామసత్వాలు కేవల బ్రహ్మమహేశ్వరపరాలు యేవిధంగా అవుతాయి? ఆర్షవిజ్ఞానం దృష్ట్యా ఆంతరంగికమైన పరిశీలన చేయకుండా పైపైవిషయాలను కొన్నింటిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మమహేశ్వరులకు రాజసతామసత్వాలను ఆపాదించినట్లు కనిపిస్తున్నది. చేతబడులన్నవి క్షుద్రప్రయోగాలు వామాచారపద్ధతులు, మంత్రశాస్త్రం దృష్ట్యా తీవ్రనిరసనకు గురి అయ్యాయి. శైవమతపరంగా వామాచారపద్ధతులు అతిగా వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో పెట్టుకొని శివునికి తామసత్వాన్ని ఆపాదించినట్లు కనిపిస్తున్నది. వాస్తవం పరిశీలిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ శుద్ధసాత్వికస్వరూపులే. జగన్నాటకసూత్రధారి అని శ్రీ మహావిష్ణువును సామాన్యంగా పేర్కొంటామే గాని, బ్రహ్మ, మహేశ్వరులు సైతం జగన్నాటకసూత్రధారులే. వాస్తవం పరిశీలిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురికి ఆయుధాలున్నాయి. విష్ణువు తనచక్రాన్ని యెన్నిసార్లు ఉపయోగించలేదు? యెన్నిసార్లు దుష్టశిక్షణ చేయలేదు? అదేవిధంగా బ్రహ్మ, మహేశ్వరులు మాత్రం యెంతమంది రాక్షసులను సంహరించలేదు. చేతబడులను, వామాచారప్రయోగాలను, క్షుద్రవిద్యలని మన మందరం నిరసిస్తాం. కాని వేదోక్తాలైన ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, గారుడాస్త్రం, నాగాస్త్రం, శూలప్రయోగం, గదాప్రయోగం మొదలైన అనేకప్రయోగాలతో