పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూతుడై శివుడే విరాజిల్లుతున్నాడని తోస్తుంది. విష్ణు - భాగవత - నారదీయ - గారుడపురాణాలు నాలుగూ విష్ణుమాహాత్మ్యాన్ని వర్ణించేవని, బ్రాహ్మపురాణం - పద్మపురాణాలు రెండూ బ్రహ్మను వర్ణించేవని, అగ్నిపురాణం అగ్నిని వర్ణిస్తుందని, బ్రహ్మవైవర్తపురాణం, పవితృదేవతను వర్ణిస్తుందని తెలుస్తుంది. గతంలో ఒకసారి పేర్కొన్నట్లు విష్ణుపురాణాన్ని బట్టి చూస్తే, పురాణవిషయాలూ, తత్వాలూ యిందుకు భిన్నంగా గోచరమౌతున్నాయి. విష్ణు - నారదీయ - భాగవత - గరుడ - పద్మ - వరాహపురాణాలు మహావిష్ణుతత్వమాహాత్మ్యప్రతిపాదకాలనీ, బ్రహ్మాండ - బ్రహ్మవైవర్త - మార్కండేయ - భవిష్య - వామన - బ్రాహ్మపురాణాలు సరస్వతీచతుర్ముఖకృశానులమహత్వతత్వాన్ని ప్రశంసించేవనీ, మత్స్య - కూర్మ - లింగ - శివ - స్కాంద - అగ్నిపురాణాలు దుర్గాశివలింగవిఘ్నేశకుమారస్వాముల మాహాత్మ్యతత్వస్తోత్రపూర్వకాలనీ పేర్కొనడం జరిగింది. విష్ణుపురాణవక్కణం ప్రకారం ఆరుపురాణాలు విష్ణుమాహాత్మ్య ప్రతిపాదకాలు. ఆరుపురాణాలు బ్రహ్మమాహాత్మ్యప్రతిపాదకాలు. ఆరుపురాణాలు శివమాహాత్మ్యప్రతిపాదకాలుగాను వున్నట్లు కనిపిస్తుంది. అయితే మహావిష్ణువును వర్ణించే పురాణాలు సాత్వికపురాణాలని, అవి మోక్షప్రదాలని, వాటికి ఉత్తమోత్తమస్థానం యివ్వడం జరిగింది. బ్రహ్మతత్వప్రతిపాదకాలైన ఆరుపురాణాలు రాజసగుణప్రధానాలని అవి స్వర్గప్రదాలని ఒకమెట్టు క్రిందికి దించి వర్ణించడం జరిగింది. శివమాహాత్మ్యప్రతిపాదకాలైన మిగిలిన ఆరుపురాణాలు కేవల తామసపురాణాలని యీ ఆరూ దుర్గతిదాయకాలని వీటిని విన్నవారికి మతిపోతుందని అసలు యీ ఆరుపురాణాలను కలలోనైనా చూడకూడదని, స్మరించకూడదన్న ధోరణిలో తిరస్కృతాలుగా పేర్కొనబడ్డాయి. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా గాని, వేదవిజ్ఞానం దృష్ట్యా గాని బ్రహ్మ, విష్ణు, శివతత్వమాహాత్మ్య బహుముఖ స్వరూప స్వభావాల దృష్ట్యా గాని అష్టాదశపురాణాల విషయాంతర్యం దృష్ట్యా గాని సాత్విక, రాజస, తామస, గుణపూర్వకత్వాలతో పురాణవిభజన చేసి ఆయాఫలితాలను పేర్కొనడం వాస్తవంగా కనిపించదు. పురాణాలన్నీకూడా త్రిగుణాత్మకాలే. ఒక్క పురాణాలేకావు వాటి మూలమైన వేదవాఙ్మయమంతా త్రిగుణాత్మకమే. వేదవాఙ్మయానికి, ఆర్షవిజ్ఞానానికే కాదు మొత్తం సృష్టికే మూలభూతు లనుకుంటున్న విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులు ముగ్గురూకూడా త్రిగుణాత్ములే. సృష్టిస్థితులు రెండూ యెప్పుడైతే లయాత్మకా లయ్యాయో అప్పుడే అవి కేవల సాత్వికత్వానికే కాదు. రాజస, తామసత్వాలకు సైతం ఆలవాలా లయ్యాయి. అంటే మంచిచెడు లన్నవి గాని, సుఖదుఃఖా లన్నవి కాని, వెలుగుచీకట్లు కాని సృష్టిలో నైసర్గికా లన్నమాట. వాటిల్లో ఒక్కొక్కప్పుడు హెచ్చుతగ్గుల వ్యవస్థ లేర్పడవచ్చును. అది వేరుమాట. సాత్విక, రాజస,