పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వొకనిర్ణయానికి మనం రావలసి వుంటుంది. పురాణాలను లోతుగా పరిశీలించినప్పుడు అవి అన్నీ భవిష్యపురాణంవలెనే భవిష్యద్వాణిగా అవతరించినట్లు మనం ఆమోదించవలసి వుంటుంది. ఆర్షవిజ్ఞానం దృష్ట్యా వేదవిజ్ఞానం దృష్ట్యా భవిష్యద్విషయకవాఙ్మయం అవతరించడానికి పూర్తిగా అవకాశాలున్నాయి. కాగా పాణిన్యాదిమహర్షుల ప్రసక్తి కాని, జైన, బౌద్ధాది మతప్రవక్తల ప్రసక్తి కాని ఆధునికవిషయ మనిపించుకున్న దేదైనా భవిష్యద్వాణిగా ఆమోదించినప్పుడు వాటి ఉనికిని గురించి మనం ఆక్షేపించవలసిన విషయ మేదీ వుండదు. పురాణాలను, భవిష్యద్వాణిగా ఆమోదించలేనప్పుడు వాటిల్లో ఆమూలాగ్రంగా వున్న పరమవైజ్ఞానికాలైన వాస్తవికవిషయాలను సైతం మనం వాస్తవికాలు కావని, అప్రామాణికాలని త్రోసిపుచ్చినట్లవుతుంది. ఒకవేళ పురాణాలు భవిష్యద్వాణులు కావని మనం ఆమోదిస్తే, పాణిన్యాదిమహర్షులకూ, జైనబౌద్దాదిమతకర్తలకూ, సంబంధించిన ఆధునికవిషయవిశేషాలకు సంబంధించిన వివిధప్రసక్తులన్నీ ప్రక్షిప్తాలని మధ్యలో కలుపబడినాయని మనం ఆమోదించవలసివుంటుంది. కాని యీదృష్ట్యాకూడా మరొకచిక్కు లేకపోలేదు. ఆధునికవిషయాలను ప్రక్షిప్తాలని మనం త్రోసిపుచ్చినా, అత్యంతప్రాచీనకాలంలో జరిగినచరిత్రలో యెప్పుడు జరిగాయో చెప్పలేనటువంటి నరసింహావతారాదికథలూ, ప్రహ్లాదాదిచరిత్రలూ, వారి పితృచరిత్రలూ వారివారి పూర్వజన్మలూ, భవిష్యజ్జన్మలూ మొదలైన విషయాలను గురించిన పరిపూర్ణగాథలన్నీ భవిష్యద్వాణిగానే పురాణాలలోవున్నాయి. వీటి భవిష్యద్వాణిత్వాన్ని ఆమోదించలేనివారు, అసలు భవిష్యద్వాణిత్వ మనేదే ప్రక్షిప్త మని అనక తప్పదు. ఈ విధంగా ఆర్షవిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సత్యాన్వేషణాపరత్వం లేకుండా అడ్డువచ్చినవాటి నన్నిటినీ ప్రక్షిప్తాలనో, పరికల్పితాలనో అంటూ పోతే అసలు పురాణవాఙ్మయస్వరూపస్వభావాలగురించి కాని తద్రూపంగా వేదవాఙ్మయంగురించి కాని, ఆర్షవిజ్ఞానంగురించి కాని మాట్లాడే అధికారం యీవిమర్శకులకు బొత్తిగా లేదని చెప్పవలసివస్తుంది. సత్యాన్వేషణతో ఆర్షవిజ్ఞానంలో పరిశోధన చేసే శక్తిసామర్థ్యాలు కాని, ఆవిజ్ఞానంగురించి అసలు ఆలోచించవలసిన అర్హతకాని యీవిమర్శకపరిశోధకశిఖామణులకు అణుమాత్రమైనా లేదని నిర్ద్వంద్వంగా, విస్పష్టంగా, మహత్తర ఆర్షవిజ్ఞానిగా నేను యెలుగెత్తి చాటవలసి వస్తున్నది.

పురాణాల తత్వం

పురాణాలగురించి స్కాందపురాణం పేర్కొన్న విషయాలను బట్టి చూస్తే శైవ - భవిష్య - మార్కండేయ - లైంగ - వరాహ - స్కాంద - మత్స్య - కూర్మ - వామన - బ్రహ్మాండపురాణాలు పదీ కూడా శైవప్రశంసాపూర్వకాలేనని, వీటిల్లో మూల