పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


భీతుండై కిరాతుం డొక్కరుండు నానగాగ్రంబునందే యుండినంతఁ
గిరాతుండు నిద్రింప వానరుం బిలిచి వ్యాఘ్రం బాఁకొన్నదాన [1]నీకిరాతుని
మద్భక్షణంబుగాఁ గోరి వచ్చితి [2]నీశాఖాగ్రం బూఁచిన వీఁడు వడిన
వీని భక్షించి యేఁగెద ననిన (నవ్వానరుండు) భయాతురుం డగుట వీని
నెట్లు పడనూఁతు నుత్తములు శరణాగతులం గావందగునని యంగీక
రింపకయుండె నంత నవ్వానరుండు నిద్రింప వ్యాఘ్రంబు కిరాతునిఁ
జూచి నిన్ను మ్రింగవచ్చినదాన నీ వీవానరంబుఁ బడంద్రోఁచిన
మెసంగి చనియెద ననఁ గిరాతుండు వానరంబు[3]ను బడంద్రోచె
(వ్యాఘ్రం బవ్వానరునిఁ జూచి) [4]నిన్ను విడిచెద శాఖాగ్రంబునకు నెక్కి
[5]వానిం బడంద్రోయుమని యనిచిన నమ్మహీరుహాగ్రంబునకు నెక్కి
యూరకయున్న వ్యాఘ్రంబు [6]వానిం ద్రోయుమనిన వానరం
బిట్లనియె.

12


మ.

తగునా యీతనిఁ ద్రోవ నాకు నిఁక నత్యంతాతురుండై గృహో
పగతుండై పగతుండు వచ్చినఁ గృపాపారాయణుల్ కావఁగాఁ
[7]నగు నేరంబులు గల్గనీ దురవలేపాంధుండు గానీ దుర
ధ్వగుఁడై యుండిన నుండనీ మనుచుటే ధర్మంబు లోకంబునన్.

13


క.

అని వానరముం దగఁగా
[8]గని వచ్చితి మనుచు వేదగణములు పలుకన్
విని దత్తాత్రేయుం డ
య్యనఘుని శాండిల్యుఁ గాంచి హర్షోన్ముఖుఁడై.

14


మ.

హరిశిష్యుల్ నిగమంబు లీకరణి నత్యాశ్చర్యముం బొంద ని
ద్ధరలోనన్ శరణాగతావనమహాధర్మంబె ధర్మంబు త
త్పరమాత్మాశయమెల్ల నిట్టిదియె నీభావంబునందున్ [9]మహ
త్తర మేతద్గుణ మంచుఁ దోఁచె నిది సత్యంబే ప్రమాణం బగున్.

15
  1. ఈకిరాతుని - అని వ్రాతప్రతి
  2. యీశాఖాగ్రం-
  3. నఁ బడంద్రోచె-
  4. ఇంకనేనియు నిన్ను
  5. వీనిం
  6. వీనిం
  7. దగు అని వ్రాతప్రతి. దగు అని యున్న యతిభంగము.
  8. గన్కని వచ్చితిమి. "కన్కను" అనుదానికి "సంభ్రమము" అని శబ్దరత్నాకరము. కనుగొనుట అను అర్థము దీనికి లేదు. సంభ్రమ మను అర్థ మిచ్చట సరిపోవుట లేదు. కావున "దగఁగాఁ గనివచ్చితి" మని యుండఁదగును. "కన్గొనవచ్చితి" మనిన యతిభంగము కాగలదు.
  9. మహాతర మని వ్రాతప్రతి. ఈరూపము అసాధువు.