పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

శమనవిద్రావణం బౌట శఠుల కేని
యనిశకుశలాత్ములైన చేతనుల కేని
భుక్తిముక్తులు గల్గు నాపూర్ణమహిమ
చక్రలాంఛన మిలఁ బ్రశస్తములఁ దాల్ప.

246


తే. గీ.

శంఖచక్రాదిహీనుఁడౌ జడుఁడు భోజ
నాదికర్మంబులం దయోగ్యత వహించి
విష్ణుభక్తిపరాయణవిబుధవర్గ
పంక్తి యుండంగఁ దగఁడు దుష్పాపి యగుట.

247


క.

హరిభక్తిసమేతులఁ గని
ధరలోపల శంఖచక్రధారణము సభాం
తరముల నిందించిన వాఁ
డరయఁగఁ బాషండు [1]లండ్రు రాజన్యవరుల్.

248


వ.

అంత నవ్విప్రుండు తప్తచక్రాదిభూషితుండై యూర్ధ్వపుండ్రంబులు
పూని విష్ణుశక్తులను గ్రహింప నారాయణపదాంభోజంబులు సేవిం
చుచుఁ బుత్రదారబంధుసహితుండై యైహికంబు లనుభవించి యంత
మున నిరపాయపదంబు నొందె. ఈయదుగిరిప్రభావంబు వినినఁ
బాపనిర్ముక్తులై ముక్తి నొందుదురని నారదుండు సవిస్తరంబుగా
నానతి యిచ్చె నంత.

249


మ.

సమరోర్వీపరతత్త్వసాంశయికవాసవ్యాత్మబోధక్రియో
ద్యమసిద్ధాంతికయోగశాస్త్రమయగీతాధ్యాయమాత్రామరు
ద్ద్రుమనిత్యానతపార్వతీరమణవిద్యుద్వాదరజ్యజ్జటా
విమలారుణ్యపునఃపునఃప్రకటనావిద్యోతిపత్పల్లవా!

250


క.

ఉద్ధవనామకహృదయ మ
హోద్ధవసంధాన సౌహృదోదితభాషా
శుద్ధ దయాంచితభూమ స
మిద్ధత భౌమాగ్రబలసమిద్ధతతేజా!

251
  1. డండ్రు