పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హరిభక్తుల పాదతీర్థప్రభావము

క.

అన జయవిజయులు కౌతుక
మునఁ జని సంపూర్ణతేజమున గిరిసేవా
ఘనుఁడైన బ్రహ్మరాక్షసు
ననఘాత్ములు వారు గాంచి రతిహర్షమునన్.

235


క.

హరికింకరపాదాంబుజ
పరమపవిత్రోదకాతిపావనతనులై
పరఁగిరి నారాయణు శ్రీ
ధరుఁ గీర్తింపుచు నవామృతస్తోత్రములన్.

236


వ.

వారలు బ్రహ్మరాక్షసుం గని యిట్లనిరి.

237


తే. గీ.

అతులసద్భక్తి లక్ష్మితో నాపరాత్మ
యరసి నీకున్ బ్రసన్నుఁడౌ నభినుతింపు
మంతకంటెను దత్కటాక్షానురక్తి
గలుగనేర్చునె యెట్టి సత్కర్మములను.

238


తే. గీ.

అష్టతీర్థావగాహ మట్లైన పిదపఁ
దీర్థమాడుము కల్యాణతీర్థరాజ
తీర్థమున నంత నీవు సుస్థితి వహించి
బ్రహ్మనిష్ఠ మెలంగెదు పరమనియతి.

239


వ.

ఇట్లని విష్ణుద్వారపాలురు పల్కినఁ జదుర్వేది హర్షించి ప్రథమంబున
వేదపుష్కరిణీతీర్థంబునఁ, దదనంతరంబున దర్భతీర్థంబున, నాపిదపఁ
బలాశతీర్థంబున, నంత యాదవ తీర్థంబున, నంతటఁ బద్మతీర్థంబున,
నావెనుకం బరాశరతీర్థంబున, నాపిమ్మట నారాయణహ్రదతీర్థం
బున, నంతట వైకుంఠగంగాతీర్థంబున స్నానంబు చేసి ముమ్మాఱు
నారాయణమంత్రం బుచ్చరించి బ్రహ్మరాక్షసత్వంబు విడిచి సత్వంబు
వహించి, శిఖాయజ్ఞోపవీతంబులును, దండకమండలకుండలంబులును,
దర్భాంగుళీయకంబులును, గుశాసనంబును, ధౌతోత్తరీయంబును గలిగి
ధర్మపరాయణుండై, మృదుభాషియై, మృదుగతియై, మృదుమానసుండై
మంత్రజవశీలుండై, సమస్తప్రియవాదియై బ్రాహ్మణరూపంబున
భార్యాపుత్రబాంధవులుం దానును దత్తీర్థస్నానాధికారంబున లభించిన
పౌర్వదైహికవిద్యావిశేషంబు హస్తామలకంబైన ఘనుండై యుండె.
అంత.

240