పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


భక్తాంఘ్రిరేణువుచేఁ బవిత్రంబగు కల్యాణతీర్థంబు శిరంబునఁ జల్లికొని
తద్గిరీంద్రప్రదక్షిణనమస్కారకీర్తనంబులు గావించిన భగవంతుఁడు
ప్రసన్నుండై ముక్తి నొసంగునని యానతిచ్చె. ఇట్లని వారు నిజ
నివాసంబున కేఁగి రంత.

230


ఆ. వె.

బ్రహ్మరాక్షసుండు భార్యయు సుతులును
గృధ్రనికరము యదుగిరికిఁ జేరి
[1]గిరిప్రదక్షిణంబు నెరపి తత్తీర్థాధి
వాసిపాదుపాదవారిఁ గ్రోలి.

231


మ.

ఇటులన్ మాసము లేను దాఁటిన రమాధీశుండు తదుస్తరో
త్కటపూర్వాఘములన్నియున్ మఱచి తత్త్వజ్ఞానసంపత్కరో
ద్భటులై మించిన యాజయున్ విజయు నుద్యత్ప్రేమ మీఱన్ సుధా
పటలప్రాయములైన సూక్తులఁ దగన్ బల్కెన్ బ్రమోదంబునన్.

232


సీ.

హరిరాత ఘనునకు నపచార మొనరించి
                       యాచతుర్వేది భార్యకుమార
బంధుసమేతుఁడై బ్రహ్మరాక్షసుఁ డయ్యె
                       నట్టివాఁ డిట మదీయపదభక్తి
వరపాదతీర్థాంబుపానంబుచేతఁ బ
                       విత్రుఁడై విజ్ఞానవృత్తి గలిగి
యేతదమేయగిరీంద్రపార్శ్వంబున
                       నుత్తమమూర్తియై యున్నవాఁడు


తే. గీ.

వాని మత్తీర్థములయందు వరుసతోడఁ
దీర్థమాడించి మది సేదఁదీర్చి తెండు
సింహ మెదిరిన దంతులు సెదరినట్లు
నాత్మభక్తులయెడలఁ బాపాళి యడఁగు.

233


ఆ. వె.

అమ్మహానుభావుఁ డతనిబాంధవులు మ
త్తీర్థమున మునింగి దివ్యు లగుచు
నాకమునఁ బురాతనాకంబు వదలి వ
ర్తించుచుంద్రు గాత! తదీయు లలర.

234
  1. సిరిప్రదక్షిణంబుచేసి తత్తీరాధివాసి