పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

దురితాహిదష్టనరులకుఁ
బరమౌషధ మెంచి చూడఁ బద్మాకాంతా
వరకీర్తన మొకటియే
యరయఁగ నేమిటికి దేవతాంతరమహిమల్.

224


క.

వెల్లిగొను దుఃఖవారిధి
కల్లోలము లుత్తరింపఁ గమలాక్షకథా
సల్లాపయానపాత్ర స
ముల్లాసముచేతఁ గాక యొక్కటి గలదే?

225


క.

తాపత్రయశమనమునకు
నోపన్ జగ మెఱుఁగ నయ్యదూత్తంసకథా
లాపం [1]బొక్కటియ దగు; గ
రోపమమగు నస్యదేవతోత్కర్ష మిలన్.

226


తే. గీ.

ఘనత నారాయణాఖ్య యొకానొకప్పు
డైనఁ గీర్తింపలేని మూఢాత్మువదన
మరయ వల్మీక మతనిజిహ్వాంచలంబు
చర్చ సేయంగ ఘోరభుజంగమంబు.

227


తే. గీ.

పాపులగు మానవులకు శ్రీపతికథాసు
ధారసప్రేమ ముదయించి తనరకునికి
యుష్ట్రపోతంబు మాకంద ముజ్జగించి
నింబపత్రంబు చవిగొన నిలిచినట్లు.

228


తే. గీ.

అచ్యుతానంత గోవింద యనుచుఁ దిరుగఁ
దిరుగఁ బలుకు మహాత్ములు దిరుగ రుగ్ర
పాతకాబ్ధి మహావర్తపటలమధ్య
సంతతభ్రమణైకప్రచారములను.

229


వ.

శ్రుతికర్మజ్ఞానంబులచేత హరికీర్తనంబునం గల ఫలంబు లభింపదు
కాన సర్వమహాపాపశాంతికొఱకు నారాయణనామం బుచ్చరింపుమని
సత్యనిష్ఠుం డూరకయున్న వైకుంఠప్రియుం డనునాతఁ డోరి బ్రహ్మ
రాక్షసా! నీవు నారాయణాచలంబునకు నేఁగి శిరోధార్యంబగు విష్ణు

  1. బొక్కటియేని హారోపమమగు