పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ఆది కాశ్మీరదేశాగతులై యదు
                       శైలేంద్రు సేవించి సమ్మదమునఁ
తద్దేశమునకు నాతతభక్తి మఱలి యేఁ
                       గుచు హరిభక్తు లకుంఠితావ
బోధనిష్ఠులు ద్విజపుంగవు లాహరి
                       క్షేత్రమ్మునం దుండి చేరి తమ్ముఁ
గలసి వెన్వెంట రాఁగా హరిఁ గీర్తించి
                       కొనుచు వింధ్యాటవీక్షోణిఁ జొచ్చి


తే. గీ.

యొకతటాకమున మునిఁగి యుచితపుణ్య
కర్మములు దీర్చి యధికారగౌరవమునఁ
గేశవునిఁ గొల్చి విష్ణుసంకీర్తనములు
నియతిఁ గావించునంతలో నిలిచి తెలిసి.

212


వ.

ఆబ్రహ్మరాక్షసుం డచ్చటఁ దిరుగుచున్నవాఁ డగుట సకలమహా
పాపంబులకు హరికీర్తనంబు సేయుటయే ప్రాయశ్చిత్తం బని శ్రుతి
స్మృతిపురాణేతిహాసంబులు ప్రమాణంబులుగా ఆభాగవతులు ప్రసంగ
వశమున చెప్పికొనుమాటలు దూరంబుననుండి విని గృధ్రరూపులై
యున్న భార్యాపుత్రులును దానును హరిభక్తిదర్శనకీర్తనంబుల
హృదయంబు ప్రసన్నంబైన ఆవిష్ణుభక్తపదాంభోజసంగపూతజలంబు
దృష్టిపథంబున నున్నఁ బానంబు చేసి యా రాక్షసుండ వైకుంఠ
తద్భక్తభుక్తశిష్టపాత్రక్షాళనతోయపరికీర్ణాన్నకబళంబులు భుజించి
గృధ్రంబులు దాను జాతిస్మరత్వంబు నొంది వైవస్వతుఁ డానతి
యిచ్చినక్రమంబుఁ దలంచుకొని విష్ణుభక్తాంఘ్రితీర్థంబున ముక్తియె
ఫలియించె; ఫలాంతరము లనిన నెంత? యని భావించుచు.

213


మ.

అపు డుప్పొంగుచు బ్రహ్మరాక్షసుఁడు పూర్ణానందుడై, దక్షిణా
ధిపపూర్వోక్తవిశుద్ధ వైష్ణవవరుల్ [1]దీవ్యత్తనుల్ నిత్యధ
ర్మపరుల్ భూతలభాగ్యదేవతలు సారజ్ఞుల్ మునుల్ వీరెకా!
యపరిచ్ఛేద్యమహానుభావులని తా నాత్మన్ బ్రశంసించుచున్.

214


క.

మన ముల్లసిల్ల దూరం
బున దండప్రణతి చేసి పొదవెడు పాపా
త్ముని బ్రహ్మరాక్షసుం గని
ఘను లాకాశ్మీరదేశకర్తలు విప్రుల్.

215
  1. సత్యవ్రతుల్ నిత్యధ — (యతిభంగము)