పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

యతులదుర్వారఘోరాహియైన జిహ్వ
గలిగి పాతాళకల్పముఖంబుతోడఁ
[1]గోఱ లిరువంక భయములు గులుక నెలవు
లందు మాంసంబు మెసవుచు నంతనంత.

208


వ.

నిమ్నదృష్టియు, శూర్పకర్ణుండును, వక్రబాహుండును, దిర్యక్ప్రేక్ష
ణుండును, గుక్కుటోరస్థ్సలుండును, బలలాశాతురశ్యేనశివాది
సంసేవితుండును, దాళప్రమాణపాదద్వయుండును, శూలఖడ్గ
ధరుండును, బ్రేతచీవరావరణుండును, గర్ణావలంబికపాలుండును,
గపాలమాలికాలంకారుండును, [2]భస్మోద్ధూళితసర్వాంగుండును బాప
కర్మదృష్టిగోచరుండును, నాంత్రమాలోపవీతుండును, దమనకోటి
బంధుండును, భైరవస్వరుండును నై పుత్రమిత్రభార్యాసహితుండై
బ్రహ్మరాక్షసత్వంబుఁ గాంచి యనేకవర్షసహస్రంబులు జీవకోటుల
భక్షించుచునుండె. వానిదారాపుత్రులు గృధ్రరూపంబునఁ దత్పార్శ్వ
వర్తులై యతండు హింసించిన జంతువుల మాంసంబులు భుజియించు
చుండిరి. ఈశ్వరద్రోహులకు ని ట్లనుభవించుట చాలునె నిత్య
నిరయంబులు గాక?

209

భాగవతానుగ్రహమున చతుర్వేదికి బ్రహ్మరాక్షసత్వము తొలఁగుట

శా.

ఆకాలంబున నేఁగుదెంచిరి [3]మహోద్యద్ధీవిభాసుల్, నుత
శ్లోకుం డొక్కఁడు సత్యనిష్ఠుఁ డనఁ దేజోధర్మసంపన్నతన్
వైకుంఠప్రియనామకుం డొకఁడు నన్వర్థాహ్వయప్రక్రియన్
లోకుల్ చూడఁ జెలంగి రద్భుతగుణాలోక్య[4]ప్రభావాఢ్యులన్.

210


క.

వారలు పుణ్యచరిత్రులు
నారాయణగిరివరాధినాథ శ్రీమ
న్నారాయణదేవాంఘ్రిస
మారాధన మాచరించి యరుదెంచుఘనుల్.

211
  1. గోర లిరువంక
  2. భస్మోద్ధూళనలిప్తుండును
  3. మహోదారుల్ సమగ్రోత్తమ — (యతిభంగము)
  4. ప్రభావంబునన్